మాక్లూర్, నవంబర్ 2: జర్నలిస్టులు ఆత్మగౌరవంతో పనిచేయాలని, వృత్తిని ప్రేమించాలని సీనియర్ జర్నలిస్ట్ వల్లీశ్వర్ అన్నారు. మాక్లూర్ మండలంలోని అడవిమామిడిపల్లిలో ఉన్న శ్రీఅపురూప కళ్యాణ మండపంలో ఆదివారం అమృతలత జీవన సాఫల్య అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సన్మానం పొందిన ఆయన.. కవులు, రచయితలను ఉద్దేశించి మాట్లాడారు. తాను నిర్భయంగా, నిజాయితీగా సమాజానికి మేలు చేసే ఎన్నో కథనాలు రాశానని, పలువురు ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురిచేశానని గుర్తుచేశారు.
ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు ఎవరికీ లొంగబోడన్నారు. సంకల్పం మనసులో ఉంటే ఏదైనా సాధిస్తామని తెలిపారు. ఆంధ్ర పత్రికలో తాను మొదటగా విలేకరిగా పనిచేశానని, అనంతరం ఐదు దశాబ్దాలుగా పలు దినపత్రికల్లో నిబద్ధత గల జర్నలిస్ట్‌గా పనిచేశానని చెప్పారు. జై ఆంధ్ర ఉద్యమంతో ప్రాంతీయ, జాతీయ స్థాయిలో సంచలనాత్మక కథనాలు రాసి తనదైన శైలిలో ముద్రవేసుకున్నానని తెలిపారు.
అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి కన్వీనర్, ముఖ్య అతిథి డాక్టర్ మృణాళిని అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేశారు. రచయిత్రి ప్రతిమ, కాళోజీ అవార్డు గ్రహీత రమాదేవి, జొన్నలగడ్డ, రాజగోపాల్రావు, రామలక్ష్మి, శాంతి నారాయణ, భాస్కర్, వెంకటకృష్ణ, వల్లీశ్వర్, అశోక్‌కుమార్, సుమీలాశర్మ, సుజాత, వసుంధర, విజయ, స్వయం ప్రకాశ్, శంకర్, లక్ష్మణ్, విజయ, శమంత, కుసుమలత, ఓంప్రకాశ్, నరసింహారెడ్డి, వివేక్ తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో కవులు, రచయితలు పాల్గొన్నారు.