ఆధునిక యుగంలో అన్నింటా సాంకేతికత రాజ్యమేలుతున్నది. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు డిజిటల్ దునియాలోనే విహరిస్తున్నాం. ఇప్పుడు నగధగల్లోనూ సాంకేతికత ఒదిగిపోతున్నది. స్మార్ట్ఫోన్లు మొదలుకుని స్మార్ట్‌వాచ్‌లు, బ్రేస్లెట్లు, ఉంగరాలు.. ఒక్కటేమిటి ప్రతి ఆభరణాన్నీ స్మార్ట్‌గా మార్చేస్తున్నారు తయారీదారులు. ఈ స్మార్ట్ జువెలరీ అలంకరణతోపాటు ఆత్మరక్షణలోనూ సహాయపడుతుండటంతో వీటికి మంచి ఆదరణ లభిస్తున్నది. ఆధునిక అతివల అలంకరణలో భాగంగా మారిన ఇస్మార్ట్ ఆభరణాల సంగతులే ఇవి..
స్మార్ట్ ఆభరణాలు అలంకరణతోపాటు ఆరోగ్యం గురించి తెలుసుకోవడంలోనూ, ఆత్మరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయి. చెవిపోగులుగా అమరిపోయే థర్మామీటర్లు, కావలసిన సమాచారాన్ని కళ్లముందు ఉంచే గాగుల్స్, ప్రేమికుల గుండెచప్పుడు వినే లవ్ లాకెట్, పీరియడ్స్ సమయంలో మహిళల మూడ్స్వింగ్స్ని అర్థం చేసుకునే స్మార్ట్ రింగ్స్… ఇలా చెప్పుకొంటూపోతే సాంకేతికత మేళవించిన ఆభరణాలు లెక్కలేనన్ని మార్కెట్లోకి వచ్చేశాయి. అంతేకాదు ఆత్మరక్షణలోనూ సాంకేతిక ఆభరణాలు పైచేయి సాధిస్తున్నాయి. ఎల్ఈడీ లైటింగ్ రింగ్స్, అలారమ్ బ్రేస్లెట్స్, చిన్నపిల్లలు తప్పిపోకుండా సెన్సర్లు జోడించిన ఆభరణాలు.. ఇలా మేనిపై మెరిసిపోతూనే, ఆత్మరక్షణ అందిస్తున్నాయివి.
అమెరికా విశ్వవిద్యాలయానికి చెందిన షిర్లీ, జుయే, యుజియా అనే ముగ్గురు విద్యార్థులు శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగపడే థర్మామీటర్‌ను జోడించిన చెవిపోగుల్ని తయారుచేశారు. డ్యూయల్ సెన్సర్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ యాంటెనాతో తయారైన ఈ చెవిపోగు బ్యాటరీలతో పనిచేస్తుంది. దీనిని ధరించిన వ్యక్తి శరీర ఉష్ణోగ్రతతో పాటు, పరిసరాల ఉష్ణోగ్రతలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి, మొబైల్‌కు సమాచారం ఇస్తుంది. అంతేకాదు అమ్మాయిలకు ప్రతినెలా వచ్చే పీరియడ్స్‌లో విపరీతమైన కడుపునొప్పితోపాటు, మూడ్‌స్వింగ్స్ కుదురుగా ఉండనివ్వవు. ‘ఫెమ్టెక్ బీబీ రింగ్’ ఈ మూడ్‌స్వింగ్స్ నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఇదొక స్మార్ట్ రింగ్, సాధారణ హెల్త్ ట్రాకర్ మాదిరిగానే ఇందులోనూ, వివిధ సెన్సర్లతోపాటు, ఎమోషన్స్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. పీరియడ్స్ సమయంలో దీనిని ధరిస్తే ప్రతినెలా భావోద్వేగాల్లో వచ్చే మార్పులను పరిశీలించి సమాచారం ఇస్తుంది. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే దీనిని, మొబైల్‌కు కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు.
ఇక ప్రేమికులకు బాగా నచ్చే లవ్ లాకెట్లు కూడా స్మార్ట్‌గా మారిపోయాయి. దీనిని ధరించిన వారు తమ గుండె చప్పుడును తమ ప్రియమైన వ్యక్తితో పంచుకోవచ్చు. లాకెట్లో ఉండే బటన్‌ను నొక్కినప్పుడు, మీరు ప్రియుడి ఫోన్‌కి మీ గుండె చప్పుడు చేరిపోతుంది. ఇక స్మార్ట్ రింగ్స్ ఆధునిక ఫ్యాషన్‌లో భాగంగా మారిపోయాయి. ఇవి చూడటానికి సాధారణ ఉంగరాల వలే కనిపిస్తాయి, కానీ లోపల అధునాతన సెన్సర్లు, చిప్‌లు ఉంటాయి. వీటిని ఉపయోగించి రోజువారీ కదలికలు, క్యాలరీల ఖర్చు, నడక దూరాన్ని ట్రాక్ చేయవచ్చు. ఈ స్మార్ట్ ఆభరణాలు బంగారం, వెండి, రోజ్ గోల్డ్ ఫినిష్‌లలో లభిస్తున్నాయి. సంప్రదాయ ఆభరణాలకు ఏమాత్రం తీసిపోవు. ఎల్ఈడీ ఆభరణాల్లో చిన్న లైట్లు ఒదిగి ఉంటాయి. ఇవి ఆభరణానికి గ్లో ఎఫెక్ట్ ఇస్తాయి. నెక్లెస్‌లు, బ్రాస్లెట్లు, ఇయర్రింగ్స్ రూపంలో ఇవి లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ స్మార్ట్ ఆభరణాలను అలంకరించుకుని మెరిసిపోండి!