గుమ్మడిద, జనవరి 7: బాలానగర్-మెదక్ జాతీయ రహదారి 765డీ పైన మూల మలుపులు ప్రమాదాలకు పిలుపుగా మారాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల టోల్‌ప్లాజా నుంచి నర్సాపూర్ మీదుగా వెళ్తున్న జాతీయరహదారి 765డీ పైన 16 కిలోమీటర్ల మేర పదుల సంఖ్యలో యూటర్న్లు ఉన్నాయి. ఈ ప్రమాదకర మూలమలుపులు వాహనదారులకు ప్రాణసంకటగా మారాయి. గుమ్మడిదల టోల్‌ప్లాజా సమీపంలో గుమ్మడిదల వెళ్తున్న దారిలో గతంలో గుమ్మడిదలకు చెందిన రైతు సంజీవరెడ్డి ఉదయం పంటపొలానికి వెళ్లి, విద్యుత్ సరఫరా లేకపోవడంతోజాతీయరహదారి సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ఉండడంలో దానిని సరి చేయడానికి విద్యుత్ లైన్మెన్కు సమాచారం ఇవ్వడానికి అక్కడికి వెళ్లాడు. ఇదే సమయంలో అటుగా వస్తున్న మట్టి టిప్పర్‌లారీ మూలమలుపు వద్ద నిలుచున్న రైతు మీదుగా పోవడంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందాడు.
గుమ్మడిదల బస్‌స్టాండ్ సమీపంలో యూటర్న్ ఉండడంతో పదుల సంఖ్యలో వాహనదారులు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు.గుమ్మడిదల, మంభాపూర్, నల్లవల్లి అటవీ ప్రాంతంలో నర్సాపూర్‌కు వెళ్లే జాతీయరహదారిపై పదుల సంఖ్యలో యూటర్న్లు ఉన్నాయి. ఇటీవల నల్లవల్లి అటవీ ప్రాంతంలో మేడాలమ్మ ఆలయ సమీపంలో ఒక కారు, రెండు ఆటోలు ఢీ కొన్నడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పీఆర్ ఏఈఈ మనీషా, డిగ్రీ విద్యార్థి ఐశ్వర్యలక్ష్మి, ఉపాధికోసం వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న మాలోతు ప్రవీణ్, కూలీ పని కోసం వెళ్తున్న అనసూయ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నర్సాపూర్ మీదుగా ప్రయాణిస్తున్న వాహనదారులు తరుచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో తమ వారిని కల్పోయి అనేక కుటుంబాలు బాధను అనుభవిస్తున్నాయి.
యూటర్న్ల వద్ద కానరాని ప్రమాద హెచ్చరికల బోర్డులు
గుమ్మడిదల- నర్సాపూర్ జాతీయరహదారిపై ఉన్న మూలమలుపుల వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను స్థానికులు,వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. యూటర్న్ల వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డులు లేకపోవడంతో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయి. వెంటనే హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నారు. జాతీయరహదారి మీదుగా నర్సాపూర్-నల్లవల్లి అటవీ ప్రాంతంలో రోడ్లపైకి కోతులు రావడంతో ప్రయాణికులు వాటికి ఆహారం రోడ్లపైన వేస్తున్నారు. రోడ్లపైన కోతులకు పండ్లు, బఠాణీలు, ఆహార పొట్లాలను వేయవద్దని సూచిస్తున్నా ప్రయాణికులు పట్టించుకోవడం లేదు. ఇలా వేయడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.