బ్రిస్బేన్: పిచ్ ఏదైనా, ప్రత్యర్థి జట్టులో ఎంతటి పటిష్టమైన బౌలింగ్ దళమున్నా, వాతావరణ పరిస్థితులెలా ఉన్నా బరిలోకి దిగాడంటే భారీ స్కోర్లు బాదుతూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల (టెస్టుల్లో) రికార్డులకు గురిపెట్టిన ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్.. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేయాలన్న అతడి చిరకాల వాంఛ గురువారం తీరింది. సుమారు పుష్కరకాలం (2013 నుంచి 15 టెస్టులాడి) పాటు 30 టెస్టు ఇన్నింగ్స్‌లో కంగారూల గడ్డపై మూడంకెల స్కోరు చేయలేక ఆపసోపాలు పడ్డ రూట్ (202 బంతుల్లో 135 నాటౌట్, 15 ఫోర్లు, 1 సిక్స్).. బ్రిస్బేన్ వేదికగా గురువారం మొదలైన డే అండ్ నైట్ టెస్టులో తన ముచ్చట తీర్చుకున్నాడు.
రూట్‌తో పాటు ఓపెనర్ జాక్ క్రాలీ (93 బంతుల్లో 76, 11 ఫోర్లు) రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 74 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. ఆసీస్ వెటరన్ పేసర్ మిచెల్ స్టార్క్ (6/71) మరోసారి చెలరేగి ఇంగ్లండ్ టాప్, లోయరార్డర్‌ను కకావికలం చేశాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు స్కోరుబోర్డుపై పట్టుమని పది పరుగులు కూడా చేరకముందే డకెట్, పోప్ సున్నాలు చుట్టి పెవిలియన్ చేరారు. పింక్ బాల్‌తో స్టార్క్ ఆరంభంలో నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్‌కు మరోసారి కష్టాలు తప్పవనే అనిపించింది. కానీ క్రాలీ, రూట్ మాత్రం ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. క్రాలీ తన శైలికి తగ్గట్టు దూకుడుగా రన్స్ రాబట్టినా రూట్ నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. టీ విరామం అనంతరం నెసర్ బౌలింగ్‌లో క్రాలీ నిష్క్రమించినా బ్రూక్ (31)తో కలిసి అతడు ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. అయితే డ్రింక్స్ విరామం తర్వాత స్టార్క్.. బ్రూక్‌ను ఔట్ చేసి ఇంగ్లిష్ జట్టును మరోమారు దెబ్బకొట్టాడు. డిన్నర్ అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్ (19) రూట్‌తో సమన్వయ లోపంతో రనౌట్‌గా నిష్క్రమించాడు.
ఆ తర్వాత జెమీ స్మిత్ డకౌట్ అవగా విల్ జాక్స్ (19), అట్కిన్సన్ (4) కార్స్ (0) స్టార్క్ దెబ్బకు తోకముడిచారు. ఒకపక్క వికెట్లు పడుతున్నా క్రీజులో పట్టుదలగా నిలిచిన రూట్.. డాగెట్ ఓవర్లో రెండు బౌండరీలతో శతకానికి చేరువయ్యాడు. బొలాండ్ వేసిన 66వ ఓవర్లో బంతిని బౌండరీకి తరలించిన అతడు.. కంగారూల గడ్డపై తొలి శతకాన్ని ఓవరాల్‌గా తన కెరీర్లో 40వ సెంచరీని నమోదుచేశాడు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (26 బంతుల్లో 32*) అండతో బజ్‌బాల్ మోడ్‌లోకి వచ్చేసిన రూట్.. ఇంగ్లండ్ స్కోరును 300 దాటించడమే గాక ఆ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.
ఆసీస్ ప్రీమియం పేసర్ స్టార్క్.. టెస్టుల్లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్ ఆడుతూ అత్యధిక వికెట్లు తీసిన లెఫ్టార్మ్ పేసర్లలో స్టార్క్ (418).. పాకిస్థాన్ దిగ్గజం వసీమ్ అక్రమ్ (414) రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయడంతో స్టార్క్ ఈ ఘనతను అందుకున్నాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 74 ఓవర్లలో 325/9 (రూట్ 135*, క్రాలీ 76, స్టార్క్ 6/71, నెసర్ 1/43)