నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రామ్ దేశినా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని శ్రీవైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా నుంచి ‘పొమ్మంటే..’ అనే పాటను విడుదల చేశారు. తోబుట్టువుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ, వారు విడిపోవడం వల్ల కలిగే బాధను తెలియజేస్తూ భావోద్వేగప్రధానంగా ఈ పాట సాగింది.
హారిస్ జయరాజ్ స్వరపరచిన ఈ పాటను చంద్రబోస్ రచించారు. విజయ్ యేసుదాస్, శక్తిశ్రీ గోపాలన్ ఆలపించారు. ఈ పాటలో మనస్పర్థల కారణంగా విడిపోయిన అక్కాతమ్ముళ్లుగా నాగశౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ కనిపించారు. తోబుట్టువుల ప్రేమను ఆవిష్కరిస్తూ మనసును కదిలించే పాట ఇదని మేకర్స్ తెలిపారు. విధి, సముద్రఖని, నరేష్ వీకే, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : హారిస్ జైరాజ్, రచన-దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్).