న్యూఢిల్లీ, మే 21 : దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.23,420 కోట్ల నికర లాభాన్ని గడించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.19,013 కోట్ల కంటే ఇది 23 శాతం అధికమని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,28,805 కోట్ల నుంచి రూ.2,53,592 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు 11,069 కోట్ల నుంచి రూ.12,970 కోట్లకు చేరుకోగా, రెన్యువల్ ప్రీమియం వసూళ్లు రూ.79,138 కోట్ల నుంచి రూ.81,933 కోట్లకు చేరాయని తెలిపింది.
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.9,73, 288 కోట్ల ఆదాయంపై రూ.57,419 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.10 తుది డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్ దొరైస్వామి మాట్లాడుతూ..బీమా ప్రీమియంపై జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో బీమా వ్యాపారం పుంజుకోవడానికి దోహదపడిందన్నారు. వ్యక్తిగత, జీవిత బీమా పాలసీలపై 18 శాతంగా ఉన్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేసిన విషయం తెలిసిందే.