న్యూఢిల్లీ, ఆగస్టు 7 : ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.10,987 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.10,461 కోట్ల లాభంతో పోలిస్తే ఐదు శాతం వృద్ధిని కనబరిచింది. ఏడాదిక్రితం రూ.2,10,910 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం సమీక్షకాలానికిగాను రూ.2,22,864 కోట్లకు ఎగబాకినట్టు కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.7,525 కోట్లుగా నమోదవగా, రెన్యూవల్ ప్రీమియం రూ.59,885 కోట్లు వసూలయ్యాయి. ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టినందుకుగాను సంస్థకు రూ.1,02,930 కోట్ల ఆదాయం సమకూరింది.
జూన్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి ఎల్ఐసీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ మొత్తం ఆరు శాతం ఎగబాకి రూ. 57.05 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సంస్థ తీసుకొచ్చిన బీమా సఖి యోజన పథకం కింద 1.99 లక్షల మంది మహిళా ఏజెంట్లను నియమించుకున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో దొరైస్వామి తెలిపారు. సమీక్షకాలంలో వ్యక్తిగత ప్రీమియం ఆదాయం ఆరు శాతం వృద్ధితో రూ.71,474 కోట్లుగా నమోదైంది. గ్రూపు ప్రీమియం ఆదాయం 2.46 శాతం అధికమై రూ.47,726 కోట్లుగా ఉన్నది. తొలి త్రైమాసికంలో సంస్థ కొత్తగా 30.39 లక్షల పాలసీలను విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో విక్రయించిన పాలసీలతో పోలిస్తే 14.75 శాతం తగ్గాయి.