ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 13: ఓబీసీలకు వెన్నుపోటు పొడుస్తున్న బీజేపీని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓడించి తీరుతామని తెలంగాణ బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హెచ్చరించారు. ఓబీసీ కులగణన చేపట్టకుండా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న బీజేపీకి బుద్ధిచెప్తామని స్పష్టంచేశారు. ఓబీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం, జాతీయ ఓబీసీ హక్కుల పరిరక్షణ ఫోరం, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం ప్రదర్శన నిర్వహించారు. ఓబీసీ జనగణన చేపట్టాలని ప్రధాని నరేంద్రమోదీకి లక్ష పోస్ట్ కార్డులను పంపే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓబీసీ కులగణన చేపడుతామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని మండిపడ్డారు. కులగణన లేకుండా ప్రభుత్వాలు సామాజిక, విద్య, ఆర్థిక విధాన ఫ్రేమ్‌వర్క్‌ను ఎలా రూపొందిస్తాయని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను విస్మరిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. జాతీయ ఓబీసీ హక్కుల పరిరక్షణ ఫోరం జాతీయ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ దేశంలోని 75 కోట్ల మంది ఓబీసీలున్నారని, వారి కులగణన చేయకపోవడం వల్ల సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ అసమానత, అణచివేత, వివక్షలకు గురవుతున్నారని వాపోయారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా తాము సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం నేతలు కిరణ్‌కుమార్, శివకుమార్, లింగస్వామి, స్వామిగౌడ్, కొండల్, రవితేజ, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.