బంజారాహిల్స్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రంలో నీటి లభ్యత ఎక్కువైనందున, నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్‌రావు అన్నారు. ఎర్రమంజిల్‌లోని మెర్క్యురీ హోటల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ వాటర్ కన్సార్టియం సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రకాశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో భూగర్భ పెరిగాయని, సాగునీటి లభ్యత ఎక్కువవటంతో లక్షల ఎకరాల ఆయకట్టు పెరిగిందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గతంలో లక్ష ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉండేదని, ప్రస్తుతం 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఏర్పడిందని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో భూగర్భజలాలు సగటున 4 నుంచి 6 మీటర్ల మేర పెరిగాయని వివరించారు. ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్ డాక్టర్ పండిత్ మధునూర్, వాలంతరి సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్, వాటర్ ఎయిడ్ సంస్థ ప్రతినిధులు రంగరాజన్, ఏబీ ఇన్‌బీవ్ సంస్థ డైరెక్టర్ అశ్విన్ కాక్ తదితరులు పాల్గొన్నారు.