సిటీలో తాగునీటి మాఫియా రెచి.్చపోతున్నది. ఎక్కడ పడితే అక్కడ వేలాది అడుగుల లోతులో బోర్లను తవ్వి భూగర్భ జలాలను జలగల్లా పీలుస్తున్నారు. నాలాలు, మూసీ పరిసరాల్లో బోర్లను తవ్వి విషపూరితమైన నీటిని తోడి విక్రయిస్తున్నారు. అధికారులు అడ్డుకుంటారన్న ఉద్దేశంతో జలమండలి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ లోగోలు, నేమ్ బోర్డులను వాడుకుంటూ.. నీటి దందాకు తెగబడుతున్నారు.
సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): జలమండలి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ లోగోలు, నేమ్ బోర్డులను వాడుకుంటూ.. నీటి దందాకు తెగబడుతున్నారు అక్రమార్కులు. ఎక్కడ పడితే అక్కడ వేలాది అడుగుల లోతులో బోర్లను తవ్వి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో నీటి రిజర్వాయర్లను ఏర్పాటు చేసి వేలాది రూపాయలకు విక్రయిస్తున్నారు. నీటిని అక్రమ బోర్ల ద్వారా తరలించడాన్ని ప్రభుత్వ అధికారులు అడ్డుకుంటారనే భయంతో కొత్త మాఫియాకు తెరతీస్తున్నారు. ఈ దందా శివారు ప్రాంతాలు, నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ఏరియాల్లో మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నది. నెలల తరబడిగా అక్రమార్కులు ప్రభుత్వ లోగోలతో నీటి మాఫియాకు పాల్పడుతున్నా అధికారులు మాత్రం చీమ కుట్టనట్లు వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కనీస తనిఖీలు చేపట్టకుండా మొద్దు నిద్ర వీడుతున్నారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. జలమండలి, హెచ్ఎండీఏ లోగోలను విచ్చలవిడిగా వాడుతున్నా ఎక్కడా తనిఖీలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో జలమండలి నీటిని సరఫరా చేసిన ట్యాంకర్ యజమానులు లోగోలు, పేర్లను తొలగించకుండా ప్రైవేట్‌గా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్‌పైన జలమండలి పేరు, లోగో ఉండటంతో వినియోగదారులు ఆ నీరు జలమండలి నుంచే వస్తున్నాయని అనుకుంటున్నారు. జలమండలి నుంచి వచ్చే నీళ్లు సురక్షితమని భావించి అక్రమార్కులు ఏ నీళ్లను తీసుకొచ్చినా.. ఎలాంటి అనుమానం లేకుండా కప్పిపుచ్చుతున్నారు. నగరవ్యాప్తంగా వందలాది ట్యాంకర్లు అక్రమంగా తిరుగుతున్నాయి.
10 వేల లీటర్ల నుంచి 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లు సాఫ్ట్వేర్ కంపెనీలు, కమర్షియల్ భవనాలకు హెచ్ఎండీఏ లోగోతో నీటిని సరఫరా చేస్తున్నాయి. శివారు ప్రాంతాల్లోని పలు ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ సంస్థలు, రెస్టారెంట్లు, హోటళ్లకు పెద్ద మొత్తంలో హెచ్ఎండీఏ, జలమండలి లోగోలతో నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నా హెచ్ఎండీఏ, జలమండలి లోగోలు ఉండటంతో ఎన్ని డబ్బులైనా వెచ్చించి నీటిని కొనుగోలు చేస్తున్నారు. అధికారులు మాత్రం ఎక్కడా తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. నగరంలో నీటి ఎద్దడి మరో నెలపాటు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికైనా తనిఖీలు చేసి అక్రమార్కులను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

యథేచ్ఛగా బోర్లు తవ్వి..
నగర శివారు ప్రాంతాలతో పాటు జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా బోర్లను తవ్వి నీటిని తోడేస్తున్నారు. 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లతో నీటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. వందలాది ట్యాంకర్ల ద్వారా కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. వాల్టా చట్టం ప్రకారం బోర్లను తవ్వేందుకు రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి అయినా ఎక్కడా అనుమతులు తీసుకోవడం లేదు. వందలాది బోర్లను అక్రమంగా తవ్వుతూ భూగర్భ జలాలను జలగల్లా పీలుస్తున్నారు.
కానీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రెవెన్యూ అధికారులు మాత్రం ఎక్కడా తనిఖీలు చేయడం లేదు. కనీసం అనుమతులున్నాయా? అని చూడటం లేదు. దీంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. భూగర్భ జలాలను పీల్చేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజల ఇండ్లలో బోర్లన్నీ ఎండిపోయి తాగునీటి ఎద్దడి ఏర్పడుతున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ బోర్లను సీజ్ చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.