శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8: రాయదుర్గం నూతన ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు వాహనదారులకు మెరుగైన సేవలందించే చర్యలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర శ్రీకారం చుట్టారు. ప్రతి లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ట్రాఫిక్ పీఎస్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.
రాయదుర్గం లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నూతన ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. రాయదుర్గం లా అండ్ ఆర్డర్ పీఎస్‌లో ఉన్న డ్రైనింగ్హాల్, బ్యారక్ ప్రాంతాన్ని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు కేటాయించారు. చిన్న చిన్న మార్పులతో పూర్తి స్థాయిలో సేవలందించేందుకు ఈ నూతన రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ను తీర్చిద్దిదారు. రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ కోసం గచ్చిబౌలి జంక్షన్ మొదలుకొని రాయదుర్గం నారాయణమ్మ కళాశాల వరకు, ఖాజగూడ జంక్షన్ నుంచి నానక్‌రాంగూడ ఔటర్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలు, రాయదుర్గం, ఖాజగూడ, మధురానగర్ కాలనీ, ప్రశాంతిహిల్స్, మణికొండలో కొంత ప్రాంతాన్ని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోకి తెచ్చారు.
ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. సెక్టార్ల వారీగా ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓగా ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక ఏఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 40 మంది కానిస్టేబుళ్లను కేటాయించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్గా శ్రీనాథ్‌కు బాధ్యతలు అప్పగించారు. మూడు సెక్టార్లుగా రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌ను విభజించి సెక్టార్ల వారీగా సేవలు అందిస్తున్నారు.
ఐటీ కారిడార్, నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో కరోనా తర్వాత ఇటీవల తిరిగి సాఫ్ట్వేర్ కార్యాలయాలు ప్రారంభమై తమ సేవలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రధాన రహదారులపై తగ్గించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన నూతన లింకురోడ్ల మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వాహనదారులు లింకురోడ్లను వినియోగించుకునేలా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం.
– ఎస్.శ్రీనాథ్, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సీఐ