న్యూఢిల్లీ : జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ)ని ప్రముఖ విద్యావేత్తలు యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్సికర్ సోమవారం హెచ్చరించారు. టెక్స్బుక్స్లో తాజా సవరణల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీకి రాసిన లేఖలో, టెక్స్బుక్స్ను వక్రీకరించే నైతిక, చట్టబద్ధ హక్కు ఎన్సీఈఆర్టీకి లేదన్నారు. సవరించిన పాఠ్య పుస్తకాల్లో కూడా తమను ప్రధాన సలహాదారులుగా పేర్కొనడాన్ని తప్పుబట్టారు. ఎన్సీఈఆర్టీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న టెక్స్బుక్స్ సాఫ్ట్కాపీస్లో తమ పేర్లను తొలగించాలని గత ఏడాదిలోనే తాము కోరామని గుర్తు చేశారు. తమ పేర్లను తొలగించకుండా, 6 కొత్త వెర్షన్స్ టెక్స్బుక్స్ను విడుదల చేయడం దిగ్భ్రాంతికరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా తమ పేర్లను రాసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.