హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పోలీసుశాఖ సిబ్బందికి డీజీపీ బీ శివధర్‌రెడ్డి శుభవార్త చెప్పారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇకపై ప్రతి పోలీసు ఉద్యోగీ వారి పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం రోజు ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు విధుల్లో తీవ్ర ఒత్తిడిలో పనిచేస్తూ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపో తున్నారని గుర్తించి, వారి మానసిక ఉల్లాసం, కుటుంబ బంధాలు బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన సందర్భాలను ఆనందంగా గడిపేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులు మినహా అన్ని యూనిట్ అధికారులు సంబంధిత సిబ్బందికి సెలవులు మంజూరు చేయాలని ఆదేశించారు. కాగా, డీజీపీ నిర్ణయంపై పోలీసుశాఖలో ఇది మరో సంక్షేమ చర్యగా నిలిచే అవకాశం ఉన్నదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.