హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): న్యాయవాద కోర్సులు ఎల్లప్పుడూ హాట్కేకుల్లాగే కొనసాగుతున్నాయి. అన్ని వృత్తి విద్యాకోర్సులకు ఏటా డిమాండ్ పడిపోతుంటే లా కోర్సులకు మాత్రం డిమాండ్ క్రమేణా పెరుగుతున్నది. మిగతా వృత్తివిద్యా కాలేజీలు మూతపడుతుంటే ఒక్క లా కాలేజీలు మాత్రమే పెరుగుతున్నాయి. గత ఏడేండ్ల కాలంలో 700 పైచిలుకు వృత్తివిద్యా కాలేజీలు మూతపడ్డాయి. 2014లో 17 లా కాలేజీలుంటే 2021 వచ్చేసరికి 22 కాలేజీలయ్యాయి. మూడేండ్ల ఎల్ఎల్బీలో 4,210 సీట్లు, ఐదేండ్ల ఎల్ఎల్బీలో 1,580 సీట్లు, ఎల్ఎల్ఎం కోర్సులో 738 సీట్లు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్లో కొత్తగా రెండు లా కాలేజీలు గతేడాది ప్రారంభమయ్యాయి.
నాసిరకం విద్యకు బ్రేకులు
రాష్ట్రంలో నాసిరకం విద్యకు చెక్ పడుతున్నది. నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండటం, విద్యాప్రమాణాలకు పెద్దపీట వేస్తుండటంతో పలు ప్రైవేట్ కాలేజీలు మూతపడుతున్నాయి. ఇంజినీరింగ్ సహా అన్ని వృత్తి విద్యాకాలేజీల్లో అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వృత్తివిద్యాకాలేజీలకు పెద్దఎత్తున అనుమతులిచ్చారు. అవి ప్రమాణాలు పాటించకపోవడంతో సీట్లు నిండక మూతబడుతున్నాయి. 2014లో 1,703 వృత్తి విద్యాకాలేజీలుంటే 2020-21 వచ్చేసరికి 997కు చేరుకున్నాయి.