న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఎల్ఐసీ మెగా ఐపీవోలో భారీగా పెట్టుబడి చేసే అంతర్జాతీయ సంస్థల్ని, ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రోడ్‌షోలను ప్రారంభించింది. ఇప్పటివరకూ భారత్‌లో ఏ ఐపీవోలోనూ పెట్టుబడి చేయకుండా, కేవలం పెద్ద పబ్లిక్ ఆఫర్లపైనే దృష్టినిలిపే గ్లోబల్ ఇన్వెస్టర్లతో వర్చువల్‌గా ప్రారంభించిన ఈ రోడ్‌షోలలో చర్చిస్తున్నట్టు సమాచా రం. 180కిపైగా అంతర్జాతీయ ఇన్వెస్టింగ్ సంస్థలతో కనెక్ట్ అయ్యేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రూ. 2,000-2,100 ధరతో మార్చి 10-14 మధ్య ఆఫర్ జారీచేసి, రూ.65,400 కోట్లు సమీకరించనున్నట్టు ఇప్పటికే మార్కెట్లో అంచనాలున్నాయి. రోడ్ షోలలో ఇన్వెస్టర్ల ఆసక్తిని గమనించిన తర్వాత ఇష్యూ ధరలో మార్పు చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. క్యాపిటల్ గ్రూప్, అబెర్డీన్ అసెట్ మేనేజ్మెంట్, కాలిఫోర్నియా యూనివర్సీటీ ఎండోమెంట్, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ తదితర అంతర్జాతీయ ఫండ్స్ ప్రస్తుత రోడ్‌షోలకు హాజరైనట్టు ఆ వర్గాలు వివరించాయి. ఐపీవో కోసం ప్రభుత్వం నియమించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు గోల్డ్‌మాన్ శాక్స్, జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ తదితర 10 సంస్థలు.. ఈ రోడ్ షోల ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇష్యూ ప్రారంభానికి ముందురోజున రూ.16,040 కోట్ల విలువైన షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు.