కీవ్, మార్చి 7: ఉక్రెయిన్ను ఉక్కుపిడికిలిలో బంధించాలని లక్ష్యంగా చేసుకొన్న పుతిన్ సేనలు ఇచ్చిన హామీలను కూడా తప్పుతున్నాయి. పౌరుల తరలింపునకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ప్రకటించిన రష్యా అంతలోనే తుపాకుల మోత మోగించింది. జనావాసాలపై రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో పెద్దమొత్తంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని ఉక్రెయిన్ బలగాలు పేర్కొన్నాయి.
దేశ రాజధాని కీవ్‌తో పాటు మరియూపోల్, ఖార్కీవ్, సుమీలో 2 లక్షల మందికి పైగా పౌరులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, యుద్ధంలో పెద్దయెత్తున గాయపడిన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉన్నదని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ పేర్కొంది. దీంతో సాధారణ పౌరులు, క్షతగాత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేంతవరకూ కాల్పుల విరమణకు అంగీకరించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. దీనికి సమ్మతించిన పుతిన్.. సోమవారం ఉదయం 10 గంటల నుంచి దాదాపు పదకొండు గంటలపాటు కాల్పులను విరమించనున్నట్టు ప్రకటించారు. దీంతో కీవ్, మరియూపోల్, ఖార్కీవ్, సుమీలోని పౌరులు సరిహద్దులకు ప్రయాణమవుతున్నారు.
ఇంతలోనే రష్యా సేనలు తుపాకులతో విరుచుకుపడ్డాయి. భవంతులు, పోర్టులు, బ్రిడ్జిలపై రాకెట్లు, క్షిపణిలతో బాంబుల వర్షం కురిపించాయి. అప్పటికే తిండి, నీళ్లులేక దుర్భరమైన జీవితాలను గడుపుతున్న స్థానికులు.. తూటాల శబ్దాన్ని విని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. క్షిపణుల దాడులు జరుగుతుండటంతో పలువురు బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లలో దాక్కున్నారు. గోస్తోమెల్ టౌన్ మేయర్‌ను రష్యా సేనలు కాల్చి చంపినట్టు అధికారులు తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 11 వేల మంది రష్యా సౌనికులు మరణించినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
రష్యా చర్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడ్డారు. మానవతా కారిడార్లను ఏర్పాటు చేస్తామన్న పేరుతో రక్తపు వసారాలను రష్యా నిర్మిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని ఐరోపా సమాఖ్య, జీ-7 దేశాలను ఉక్రెయిన్ కోరింది. పుతిన్ సహా 100 మంది రష్యన్ ప్రముఖులపై న్యూజిలాండ్ ఆంక్షలు విధించింది. పుతిన్‌ను అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్టు అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ ప్రకటించింది. ఇదిలాఉండగా, రష్యా దాడులకు ప్రతిచర్యగా సైబర్‌దాడులు చేయడానికి ఉక్రెయిన్ ఓ ఐటీ ఆర్మీని తయారుచేస్తున్నట్టు సమాచారం.
జెలెన్స్కీ మరణించినా ప్రభుత్వం నడుస్తుంది: బ్లింకెన్
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరణించినప్పటికీ, ప్రభుత్వం కొనసాగేలా అక్కడి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగమంత్రి మిట్రో కులేబా తనతో చెప్పినట్టు పేర్కొన్నారు. వారం వ్యవధిలోనే జెలెన్స్కీపై మూడుసార్లు హత్యాయత్నం జరిగినట్టు ఇటీవల పలు నివేదికలు పేర్కొనడం తెలిసిందే.
రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇప్పుడే..
కాల్పుల విరమణపై రష్యా ఏకపక్ష చర్యలను బ్రిటన్ ఖండించింది. సిరియా, చెచన్యలో అమలు చేసిన కుట్రలనే రష్యా సేనలు ఉక్రెయిన్లోనూ పాటిస్తున్నాయని మండిపడింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 15 లక్షల మంది దేశాన్ని విడిచి వెళ్లారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత తక్కువ సమయంలో శరణార్థుల వలస ఇదేనని తెలిపింది. ఉక్రెయిన్ గగనతలాన్ని నో-ఫ్లైజోన్‌గా ప్రకటించకపోతే, మూడో ప్రపంచ యుద్ధం రావొచ్చని అమెరికా సెనెటర్ మార్కో రుబియో హెచ్చరించారు.