Latest News : ఇవాల్టి ముఖ్యాంశాలు
Latest News : కృష్ణా జలాలపై ఏపీతో నెలకొన్న వివాదం నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీ, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు హాజరయ్యారు.

పోతిరెడ్డిపాడు, రాయలసీమ ప్రాజెక్టులు అక్రమమే : సీఎం కేసీఆర్
పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో నీటిని అనుమతించమని ఆయన తెలిపారు. ఏపీతో జల వివాదం నేపథ్యంలో నీటిపారుదలశాఖపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ కూడా అక్రమ ప్రాజెక్టే అని కేసీఆర్ తెలిపారు. జులై 9న నిర్వహించబోయే కేఆర్ఎంబీ సమావేశాన్ని రద్దు చేయాలన్నారు. జులై 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
పరిశుభ్రంగా ఉండండి.. అంటువ్యాధులను అరికట్టండి : కేటీఆర్
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటువ్యాధులను అరికట్టవచ్చని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వేములవాడలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పట్టణంలో రహదారుల విస్తరణ, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకంపై దృష్టి సారిస్తామన్నారు. వేములవాడ పట్టణ అభివృద్ధికి తాను సిద్ధంగా ఉన్నానని, పాలకవర్గం కలిసికట్టుగా ప్రతిపాదనలు అందించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
దమ్మచెరువు లబ్దిదారులకు ‘డబుల్’ ఇండ్లు అందజేత
సిద్దిపేట జిల్లాలోని సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక అనుబంధ గ్రామం దమ్మ చెరువులో 56 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి హరీశ్‌రావు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. చింతమడక- దమ్మ చెరువు ఐక్యతకు నిదర్శనం అన్నారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఏలాంటి సాయం అందించాలన్న అంశంపై సీఎం కేసీఆర్‌తో తర్వలోనే చర్చించి నిర్ణయిస్తామన్నారు.
తెలంగాణలో కొత్తగా 848 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 848 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఆరుగురు మరణించారు. 1,114 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 12,454గా ఉంది. మరోవైపు ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,930 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఉచిత సేవలకు మంగళం అనేది అవాస్తవం: టీటీడీ
భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని టీటీడీ ఖండించింది. ఈ వార్తల ఆధారంగా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని విచారం వ్యక్తం చేసింది. కాగా అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన భక్తులు శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
జలపాతం సందర్శనకు పర్యాటకులకు అనుమతి
తెలంగాణ నయాగరాగా పిలువబడే బొగత జలపాతం సందర్శనకు పర్యాటకులకు అనుమతి లభించింది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో జలపాతం నీటి కళను సంతరించుకుని ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ప్రదేశాల్లో ఒకటైన బోగత జలపాతం ఖమ్మం జిల్లాలోని వజీద్ మండలంలోని కోయవీరపురం జి వద్ద గల దట్టమైన అడవిలో ఉంది.
రేవంత్ రెడ్డికి చెప్పు దెబ్బలు ఖాయం : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ ఠాకూర్‌కు రూ. 25 కోట్లు ఇచ్చి పీసీసీ పదవిని దక్కించుకున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. తమను రాళ్లతో కొట్టండన్న రేవంత్ రెడ్డికి చెప్పు దెబ్బలు ఖాయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్ నూతన సీఎం పుష్కర్‌సింగ్ ధామి
ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు సీఎంగా ఉన్న తీరథ్ సింగ్ రావత్ సెప్టెంబర్ 10వ తేదీలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం లేకపోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయకతప్పలేదు. దీంతో కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామిని ఎన్నుకున్నారు. రేపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ ప్రమాణం చేయనున్నారని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు.
మోదీ తెల్లగడ్డంపై శశిథరూర్ సెటైర్
ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా పొగొనోట్రోఫీ అనే కొత్తపదాన్ని ట్విటర్ ద్వారా పరిచయం చేశారు. ఆ పదంతో మోదీ తెల్ల గడ్డానికి లింక్ పెట్టారు. పొగనోట్రోఫీ అంటే గడ్డం పెంచడం అని అర్థం. కరోనా సమయంలో మోదీ కూడా పొగొనోట్రోఫీనే చేస్తున్నారని సెటైర్ వేశారు. ఈ కొత్త పదాన్ని తన మిత్రుడు రితిన్ రాయ్ అనే ఆర్థికవేత్త నేర్పినట్లు ఆయన చెప్పారు.
ఈ ఏడాదిలో 66 మంది ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. లోయలో ఈ ఏడాదిలో 66 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. గత నెల జూన్‌లో 11 మంది ఉగ్రవాదులు భద్రతా బలగాల కాల్పుల్లో మరణించారు. అత్యధికంగా ఏప్రిల్ నెలలో 17 మందిని సైన్యం హతమార్చింది.
మాజీ ముఖ్యమంత్రి మనవడితో ఆగిపోయిన మెహ్రీన్ పెళ్లి
హర్యానాకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత భజన్ లాల్ బిష్ణోయ్ ఇంటికి కోడలిగా వెళ్లాల్సిన మెహ్రీన్ కౌర్ తన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంది. భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో ప్రేమలో మునిగి పెళ్లిదాకా వెళ్లిన ఈమె.. తన పెళ్లి ఆగిపోయిందని సోషల్‌మీడియాలో చెప్పుకొచ్చింది. మరోవైపు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ కూడా తన 15 ఏళ్ల దాంపత్య జీవితాన్ని తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- latest news
- main news
- Nri
- NRI NEWS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

