బంజారాహిల్స్, డిసెంబర్ 1: సామాన్యులు ఉపయోగించే భాషనే పత్రికా భాషగా మార్చిన ఘనత ప్రముఖ పాత్రికేయులు, రచయిత నార్ల వెంకటేశ్వరరావుకే దక్కుతుందని సీనియర్ జర్నలిస్టు, రచయిత కల్లూరి భాస్కరం అభిప్రాయపడ్డారు. నార్ల వెంకటేశ్వరరావు జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ‘నార్ల బాటలో ముందున్నామా- వెనకబడ్డామా’ అనే అంశంపై స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న కల్లూరి భాస్కరం మాట్లాడుతూ.. గతంలో సాహిత్యంలో, జర్నలిజంలో గ్రాంథిక భాషను ఎక్కువగా వాడేవారన్నారు. ఆ ఒరవడిని మారుస్తూ సామాన్యుల భాషను పత్రికాభాషగా మార్చిన ఘనత నార్ల వెంకటేశ్వరరావుకు దక్కుతుందన్నారు. డా. బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొ. కె.సీతారామారావు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో నార్ల లాంటి విలువలు కలిగిన పాత్రికేయుల అవసరం ఎంతో ఉందన్నారు. నార్ల లైబ్రరీని యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.సుధారాణి, ఇన్చార్జి రిజిస్ట్రార్ డా.ఏవీఎన్.రెడ్డి తదితరులు పాల్గొని నార్ల వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.