రాష్ట్రంలోని భూముల ధరలను ప్రభుత్వం ఒక్కసారిగా భారీగా పెంచడంతో అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గణనీయంగా పెరిగిన మార్కెట్ విలువను చూసి భయపడి క్రయవిక్రయాలకు పెద్దగా ఎవరూ ఆసక్తిచూపకపోవడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య సగానికి పైగా పడిపోయింది. భూముల ధరల పెరుగుదలతో రిజిస్ట్రేషన్ ఖర్చులూ అమాంతం పెరిగి సామాన్యులను భయపెడుతున్నాయి. ధరలు పెంచకముందు రోజుకు 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగే చోట ఇప్పుడు 30నుంచి 40కే పరిమితమవుతుండగా, మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే అంతంత మాత్రంగా రియల్ ఎస్టేట్‌రంగం రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయంతో మరింత పడిపోతున్నది. ధరల పెంపు ప్రభావంతో అటు సర్కార్ ఆదాయానికీ గండి పడుతున్నది. గజం భూమి కొనేందుకూ సామాన్యుడు ఆలోచించాల్సి వస్తున్నది.
రంగారెడ్డి, వికారాబాద్, ములుగు, జూన్ 10(నమస్తే తెలంగాణ)/హనుమకొండ: భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం భారీగా పెంచడంతో రిజిస్ట్రేషన్లు సగానికిపైగా తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారితో మొన్నటివరకు కిటకిటలాడిన సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాలు వారం రోజుల నుంచి వెలవెలబోతున్నాయి. భూముల విలువను భారీగా పెంచడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తున్నది. వికారాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, అభివృ ద్ధి చెందుతున్న మండలకేంద్రాల్లో భూముల విలువలు గణనీయంగా పెరుగడం, రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన మొత్తం కూడా లక్షల్లో ఉండటం దీనికి కారణమని తెలుస్తున్నది.
ప్రస్తుతం ఇండ్ల రిజిస్ట్రేషన్లు తప్ప సాధారణ కొనుగోళ్లు జరుగడం లేదని అధికారులే చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ర్టానికి 60శాతం ఆదాయం తీసుకొచ్చే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు, ఫీజుల భారం స్పష్టంగా కనిపిస్తున్నది. ఏటా జిల్లాలో జరిగే భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం వస్తుంది. భూముల మార్కెట్ విలువ పెంచడంతో జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 50నుంచి 100శాతం వరకు భూముల మార్కెట్ విలువలు పెరుగడం, వాటిని కొనుగోలు చేసిన దాంట్లో సుమారు 30శాతం మార్కెట్ విలువకే చెల్లించాల్సి వస్తుండటంతో క్రయవిక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఫలితంగా జిల్లాలోని 18 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుకు వందకు పైగా జరిగే రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం సగానికి తగ్గాయి. మరికొన్ని చోట్ల 30నుంచి 40 కావడమే గగనమవుతున్నది. ఈ కారణంగా ప్రభుత్వ ఆదాయం కూడా 50శాతం పడిపోయింది. వికారాబాద్ జిల్లాలో గతంలో 350-400 వరకు రిజిస్ట్రేషన్లుకాగా, ప్రస్తుతం జిల్లా అంతటా 100కు మించడం లేదు. ఇక ఏజెన్సీ ప్రాంతమైన ములుగులో పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 50 నుంచి 75శాతం మేర రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ఇదివరకు రోజుకు 15నుంచి 25 రిజిస్ట్రేషన్లు అయితే.. పది రోజుల నుంచి కేవలం 5 నుంచి 6 మాత్రమే జరుగుతున్నాయి. ధరలు పెంచకముందు రిజిస్ట్రేషన్ల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 110 స్లాట్స్ బుక్ అవుతుండగా, ఇప్పుడు 60నుంచి 70కి పడిపోయాయి. మొత్తం 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 428 జరుగుతుండగా ప్రస్తుతం ధరలు పెంచిన తర్వాత 278 మాత్రమే అవుతున్నాయి.
రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ పుంజుకొన్నదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కుదేలయ్యిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం వంద గజాల ప్లాట్ కూడా అమ్మలేని దుర్భర స్థితిలో ఉన్నామని, అంతంత మాత్రంగా సాగుతున్న వ్యాపారం ప్రభుత్వ నిర్ణయంతో మరింత పడిపోయే ప్రమాదం ఉన్నదని తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భూముల మార్కెట్ విలువలు పెంచడంపై డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రోజుకు కనీసం 2నుంచి 5వరకు డ్యాకుమెంట్లు వచ్చేవని, ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమ ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ధరల పెంపు నిర్ణయంపై ప్రభుత్వం పునః సమీక్షించుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది. ములుగు మున్సిపాలిటీ పరిధిలో గజం భూమి ప్రభుత్వ విలువ గతంలో రూ.1,700. ఇప్పుడు ఏకంగా రూ. 2,600కి చేరింది. రహదారులను ఆనుకొని ఉన్న భూముల విలువ గజానికి రూ.2,100 ఉండగా, ఇప్పుడు రూ.4,700కు సవరించారు. జాతీయ రహదారి పక్కనున్న గజం భూమి గతంలో రూ.6,100 ఉంటే.. దానిని రూ.9,200గా ఖరారు చేశారు. దీంతో ఆయా భూముల విలువ 51శాతం మేర పెరిగింది. మున్సిపాలిటీ పరిధిలోనే కాకుండా గ్రామాల్లో సైతం గజం భూమి ధర సగటున రూ.500 ఉండగా అదనంగా రూ.900 (80శాతం) పెంచారు. ఎకరం వ్యవసాయ భూమి విలువ రూ.2.40లక్షలుండగా ప్రస్తుతం రూ.3.40 లక్షలకు చేరింది. మార్కెట్ విలువతో పాటు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చార్జీలు కూడా భారీగా పెరుగడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుతూ వస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను విపరీతంగా పెంచింది. ఖమ్మం నగరం ఖానాపురం హవేలీ, టేకులపల్లిలో గతంలో గజం రూ.4,100గా ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.6,200కు పెంచారు. రియల్ మార్కెట్ సరిగ్గా లేని సమయంలో మార్కెట్ విలువను పెంచడం వల్ల మాలాంటి పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. 200గజాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌కు వస్తే రూ.లక్షకు పైగా ఖర్చు అయ్యింది. గతంలో రూ.50వేల నుంచి రూ.60వేలతో అయ్యేది. ప్లాటు కొనాలంటేనే భయమేస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భూముల మార్కెట్ విలువల పెంపును కాంగ్రెస్ ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలి. కనీసం పేద, మధ్య తరగతి కుటుంబాలకు రిజిస్ట్రేషన్ రుసుముల్లో రాయితీలు కల్పించాలి. సామాన్యుడి సొంతింటి కలను మరింత దూరం చేసేలా భూముల మార్కెట్ విలువల పెంపుదల ఉంది. భూముల ధరల పెరుగుదలతో రిజిస్ట్రేషన్ ఖర్చులూ గణనీయంగా పెరిగి సామాన్యులను భయపెడుతున్నాయి.
స్థలం కొనడానికి సిద్ధమైతే రిజిస్ట్రేషన్ ఖర్చులూ భయపెడుతున్నాయి. దీంతో చాలామంది కొనుగోళ్లు వాయిదా వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నుంచి రియల్ ఎస్టేట్ నడువక, ప్లాట్లు, ఇండ్లు అమ్మకం, కొనుగోళ్లు జరుగక ఇబ్బందులు పడుతున్నం. ఇప్పుడు భూముల మార్కెట్ విలువ పెరుగడంతో రిజిస్ట్రేషన్ ధరలు పెరిగి సామాన్యుడిపై మరింత భారాన్ని మోపాయి. రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ప్రభావితం చేశాయి.
ప్రభుత్వం భూముల ధరలు పెంచడంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడుతున్నది. అసలే మార్కెట్ పరిస్థితి బాగా లేదు. ఈ సమయంలో ధరలు పెంచడం కరెక్టు కాదు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలకు అన్ని రకాలుగా ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారు తప్ప అక్కరకొచ్చే పనులేవీ చేయడం లేదు.