చాంద్రాయణగుట్ట,ఆగస్టు 10: చారిత్రాత్మకమైన లాల్‌దర్వాజ సింహ వాహిని శ్రీ మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం అమ్మవారి ఘటాల, అంబారీ ఊరేగింపు అత్యంత వైభవంగా కొనసాగింది. ప్రధాన ఊరేగింపు మార్గం జనసంద్రంగా మారింది. ఫలహారం బండ్లకు పొట్టేలను కట్టి ఊరేగించడం విశేషంగా ఆకట్టుకుంది. లాల్‌దర్వాజ అధికారిక పోతరాజు అశ్విన్ ముదిరాజ్ భక్తులను అలరించారు. దేవతమూర్తుల వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఊరేగింపునకు మరింత శోభ తీసుకొచ్చాయి. లాల్‌దర్వాజ ఆలయం వద్ద పచ్చికుండపై నిల్చొన్ని మాతంగి అనురాధ రంగం (భవిష్యవాణి)వినిపించారు. ప్రజలు చేసే పూజలతోనే దేశం సుభిక్షంగా ఉందన్నారు.
లాల్‌దర్వాజ ఆలయ విస్తరణ పనులు చేపట్టాలన్నారు.గ్రామ గ్రామన తను కొలువుదీరి ఉన్నానని,అందుకే తనతో పాటు ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.కాలికాలం కావడంతో అనుకొని సంఘటనలు జరుగుతున్నాయని,పసి పిల్లలపై ఘోరాలు పెరిగిపోతున్నాయన్నారు. ఉప్పుగూడ, ఛత్రినాక, గౌలిపుర,లాల్‌దర్వాజ మోడ్ మీదుగా చార్మినార్, నయాపూల్ ఢిల్లీ దర్వాజ వరకు ఊరేగింపు వేడుకలు నిర్వహించారు. ఉప్పుగూడలో టిల్లు తల్వార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫలహారం బండిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించుకోవడం జరిగిందన్నారు.




