ఫైనల్ చేరిన లక్ష్యసేన్
ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్‌షిప్
రెండు దశాబ్దాల తండ్లాట తీర్చేందుకు భారత యువ షట్లర్ లక్ష్యసేన్ వేయాల్సింది మరొక్క అడుగే!హేమాహేమీలకు అందని ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గేందుకు లక్ష్యకు కావాల్సింది ఒక్క విజయమే!!ప్రకాశ్ పదుకొనె, పుల్లెల గోపీచంద్ లాంటి దిగ్గజాల సరసన నిలిచేందుకు లక్ష్య గెలువాల్సింది ఇంకొక్క మ్యాచే!!!అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న లక్ష్యసేన్.. ప్రతిష్ఠాత్మక టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టాడు. సింధు, సైనా, శ్రీకాంత్ వంటి స్టార్ షట్లర్లకు సాధ్యం కాని ఘనత సాధించేందుకు లక్ష్యసేన్ నేడు కోర్టులో అడుగుపెట్టనున్నాడు!
బర్మింగ్‌హామ్: కెరీర్ ఆరంభం నుంచి నిలకడగా విజయాలు సాధిస్తున్న భారత యువ షట్లర్ లక్ష్యసేన్.. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 20 ఏండ్ల లక్ష్యసేన్ 21-13, 12-21, 21-19తో డిఫెండింగ్ చాంపియన్ లీ జీ జియా (మలేషియా)ను చిత్తు చేశాడు. తద్వారా ప్రకాశ్ నాథ్, ప్రకాశ్ పదుకొనె, పుల్లెల గోపీచంద్ తర్వాత మెగాటోర్నీ ఫైనల్‌కు చేరిన నాలుగో భారత పురుష షట్లర్‌గా లక్ష్యసేన్ రికార్డుల్లోకెక్కాడు. ఇందులో ప్రకాశ్ పదుకొనె (1980), గోపీచంద్ (2001) టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. గంటా 16 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో లక్ష్య అద్వితీయ ప్రదర్శన కనబర్చాడు.
నెట్ గేమ్ మ్యాజిక్..
ఆరు నెలలుగా సూపర్ ఫామ్‌లో ఉన్న లక్ష్యసేన్.. నిరుడు డిసెంబర్లో వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్య పతకం సాధించాడు. ఆ తర్వాత ఇండియా ఓపెన్ టైటిల్ నెగ్గడంతో పాటు జర్మన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. అదే జోరులో ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన లక్ష్య.. రెండో రౌండ్లోనే ప్రపంచ మూడో ర్యాంకర్ అండెర్స్ అంటోన్సెన్కు షాకిచ్చాడు. క్వార్టర్స్‌లో లూ గువాంగ్ జూ నుంచి వాకొవర్ దక్కడంతో సెమీస్ చేరిన లక్ష్య.. కీలక పోరులో సత్తాచాటాడు. తొలి గేమ్ ఆరంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన లక్ష్య.. అదే జోరులో గేమ్ కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి దీటైన్ ప్రతిఘటన ఎదురు కావడంతో మూల్యం చెల్లించుకున్నాడు. ఇక మూడో గేమ్‌లో నెట్ గేమ్‌పై దృష్టి పెట్టిన లక్ష్య కీలక సమయాల్లో పాయింట్లు సాధిస్తూ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు.
ఎక్కువ ఒత్తిడికి లోనుకాకుండా.. ఒక్కో పాయింట్ సాధిస్తూ ముందుకు సాగాను. ప్రతిష్ఠాత్మక టోర్నీ సెమీఫైనల్ కావడంతో ఏకాగ్రత నిలుపడం కష్టమవుతున్నా.. పట్టుదలగా పోరాడా. సెమీస్‌లో నెగ్గడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు జరుగనున్న మెగా ఫైనల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా.
వన్డే క్రికెట్లో రెండొందల మ్యాచ్‌లాడిన రెండో మహిళా క్రికెటర్‌గా భారత వెటరన్ పేసర్ జులన్ రికార్డుల్లోకెక్కింది. మిథాలీరాజ్ (230)అగ్రస్థానంలో కొనసాగుతున్నది.
ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ ఫైనల్ చేరిన నాలుగో భారత పురుష షట్లర్‌గా లక్ష్యసేన్ రికార్డుల్లోకెక్కాడు. ప్రకాశ్ నాథ్ (1947), ప్రకాశ్ పదుకొనె (1980), పుల్లెల గోపీచంద్ (2001) గతంలో ఈ ఘనత సాధించారు.