హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌లో కీలక నిందితుడు, డ్రగ్స్ విక్రేత లక్ష్మీపతిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు విశ్వసనీయ సమాచారం. ముందు నుంచీ పోలీసులు అనుమానిస్తున్నట్టుగానే అతడు గోవాలోనే తలదాచుకోవడంతో పట్టుకోవడం సులువైనట్టు తెలుస్తున్నది. లక్ష్మీపతిని పట్టుకొనేందుకు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్‌న్యూ) మూడు బృందాలను ఏర్పాటు చేసింది. అతడి నెట్‌వర్క్‌లోని దాదాపు 50 మంది తరచూ గోవా పార్టీల్లో పాల్గొంటారనే సమాచారం ఉండటంతో ఒక బృందం అక్కడ నిఘా వేసింది. అనుకొన్నట్టుగానే గోవాలో లక్ష్మీపతి పోలీసులకు చిక్కినట్టు సమాచారం. అతడి అరెస్టుతో భారీ నెట్వర్క్ గుట్టు వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు.
గతంలో మూడు సార్లు అరెస్టు
లక్ష్మీపతి గతంలోనూ మాదక ద్రవ్యాల కేసులో మూడు సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. వైజాగ్‌లో ఒకసారి, నల్లగొండలో మరోసారి, రెండేండ్ల కిందట హయత్‌నగర్ పోలీసులకు చిక్కాడు. పోలీసులకు దొరికిన ప్రతిసారి ఒక్కో అడ్రసుతో తన వివరాలు చెప్పేవాడు. భువనగిరి చెందిన ఏఎస్ఐ కుమారుడినని ఒకసారి, తనది కొండాపూర్ అని మరోసారి, ఏపీ అని ఇంకోసారి తప్పుడు చిరునామా చెప్పి ఉద్దేశపూర్వకంగానే పోలీసులను తప్పుదోవ పట్టించినట్టు సమాచారం. ప్రేమ్ ఉపాధ్యాయ్ అరెస్టుతో అలర్ట్ అయిన లక్ష్మీపతి అండ్ కో అప్రమత్తమైంది. అప్పటికే గోవాలో ఉన్న వాళ్లంతా ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకొన్నారు. హైదరాబాద్‌కు వస్తే అరెస్టు చేస్తారన్న భయంతో అక్కడే ఉండిపోయినట్టు, ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కినట్టు సమాచారం.