రంగారెడ్డి, జనవరి 30 (నమస్తేతెలంగాణ) : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Atmiya bharosa) అర్హుల ఎంపిక ప్రవాసంగా మారింది. జిల్లాలో(Rangareddy )లక్షలాది మంది అర్హులున్నప్పటికి కేవలం 14వేల మందే అర్హులంటూ అధికారులు లీస్టు విడుదల చేయటంపై ఉపాధి హామీ కూలీలు సర్వత్రా నిరసన(Laborers protest )వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ వేలాదిమంది కనీసం 20రోజులు ఉపాధి హామీ పనులకు హాజరయ్యారు. వారిలో భూమిలేని వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులున్నప్పటికి కేవలం 14వేల మందిని మాత్రమే ఎంపికచేయటం, మిగిలిన వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 2 కార్పోరేషన్లు, 21 మండలాలున్నాయి. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను మినహాయించిన ప్రభుత్వం కేవలం ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి మాత్రమే ఉపాధి హామీ పనుల్లో స్థానం కల్పించారు. దీంతో ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డు కలిగిఉన్న వారిలో మొత్తం 20రోజుల పనిదినాలు పూర్తిచేసుకున్నవారే ఉన్నారు. వీరిలో భూమిలేని ఎంతోమంది పేదలు ఉన్నారు. కాని, వీరిలో 14వేల మందిని గుర్తించారంటూ ఉపాధిహామీ కూలీలు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో 1,83,309 జాబ్‌కార్డులు..
రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల్లో 558 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో 1,83,309 జాబ్ కార్డులున్నాయి. జాబ్‌కార్డులు కలిగినవారంతా ప్రతిరోజు ఉపాదిహామీ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. జాబ్‌కార్డులతో కలిగి నవారి ఇండ్లలో ఉన్నవారు 3,77,087కూలీలు ఉపాధి పనులు చేసుకుంటున్నారు. ఇంట్లో జాబ్‌కార్డు ఉంటే ఆ ఇంట్లో ఉండే మిగిలన వారు కూడా కూలీ పనులు చేసుకోవటానికి అర్హులు. ఈ పథకం కింద జిల్లావ్యాప్తంగా ఉపాదిహామీ పనులు చేసుకుంటున్నవారు ఎంతోమంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రజాపాలనలో భూమిలేని వ్యవసాయ కూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ధరఖాస్తు చేసుకున్నారు. ఆత్మీయ భరోసాలో ధరఖాస్తు చేసుకున్న కుటుంబాల్లో అర్హులు ఎవరనేదానిపై విచారణ జరిపి వారికి ఏడాదికి రూ.12వేలు ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించింది. అర్హత కలిగిన వ్యవసాయ కూలీల కుటుంబాలు ఈ పథకం కింద ఎంపిక చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది.
అర్హుల గుర్తింపులోనూ అవకతవకలు..
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకింద జిల్లాలో అర్హులైన వారిని గుర్తించి వారికి ఏడాదికి రూ.12వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూములేకుండా ఉపాధిహామీ కూలీల్లో ఏడాదిలో 20రోజులు క్రమం తప్పకుండా పనిచేసినవారు 1.83లక్షల మంది ఉన్నారు. కాని, వారిలో కేవలం 14వేల మందిని ఏ ప్రాతిపాదికన గుర్తించారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఉపాధిహామీ కూలీల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులను ఎంపికచేయటంలో పైరవీలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని ప్రజలు వాపోతున్నారు. రంగారెడ్డిజిల్లాలో అర్హత కలిగిన వారందరిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.