న్యూఢిల్లీ : రష్యా రాజధాని మాస్కోకు సమీపంలో నగరంలోని రెండో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ లక్ష్యంగా ఉక్రెయిన్ చేపట్టిన డ్రోన్ దాడిని రష్యన్ బలగాలు భగ్నం చేశాయి. మాస్కోకు 15 కిలోమీటర్ల దూరంలోని నుకొవొ ఎయిర్పోర్ట్ టార్గెట్‌గా ఉక్రెయిన్ డ్రోన్ దాడికి తెగబడింది.
మాస్కో శివార్లలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ డ్రోన్‌ను ధ్వంసం చేయడంతో ఎయిర్‌పోర్ట్‌కు పెనుముప్పు తప్పింది. ఉక్రెయిన్‌పై శనివారం రాత్రి రష్యా వైమానిక దాడులు కొనసాగడం, దేశవ్యాప్తంగా కాల్పుల మోత నేపధ్యంలో మాస్కో ఎయిర్పోర్ట్ లక్ష్యంగా కీవ్ డ్రోన్ దాడికి దిగినట్టు భావిస్తున్నారు. కాగా, శనివారం ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ ప్రాంతంలో రష్యన్ దాడుల్లో ఇద్దరు మరణించగా, నలుగురు గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్స్కీ తెలిపారు.
రష్యా అణిచివేత ధోరణిని ఈ యుద్ధ నేరాలు బహిర్గతం చేస్తున్నాయని జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. మరోవైపు రష్యా ఆధీనంలో ఉన్న దోనెస్క్‌లో 80 ఏండ్లు దాటిన మహిళ ఉక్రెయిన్ దళాల కాల్పుల్లో మరణించిందని నగర మేయర్ అలెక్సీ కులెజిన్ చెప్పారు. ఇక మాస్కో ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి గురించి ఉక్రెయిన్ అధికారులు మౌనం దాల్చారు.