హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురవ విజయకుమార్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్లను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పరిపాలన చేతకాక ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్‌పై డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
రెండుసార్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌కి ప్రొటోకాల్ ప్రకారం భద్రత కల్పించడాన్ని తప్పుపట్టడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, ఇతర కుటుంబసభ్యులకు గన్మెన్లు, ఎసార్ట్, పైలట్ వాహనాలు ఏ హోదాలో ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.