హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ఆనవాళ్లను ఎవరూ ఎప్పటికీ చెరుపలేరని, తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన భద్రంగా ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నిర్మించి కోదాడ, సూర్యాపేట దాకా సాగు నీరందించిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. ప్రజాతీర్పును గౌరవించి కాంగ్రెస్‌కు సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారని, మూడేండ్లు ఆయన కనిపించకపోయినా గల్లీగల్లీలో ఆయన పాటలు వినిపిస్తున్నాయని గుర్తుచేశారు.
ఎన్నిక ఏదైనా ఓటుతోనే గ్యారెంటీలు ఎగ్గొట్టిన మోసపూరిత కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్లో మహబూబాబాద్ జిల్లా ఇనగుర్తికి చెందిన కాంగ్రెస్ నేత సత్తూరి యాదగిరి, ఆయన అనుచురులు పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. చైతన్యమైన ఇనుగుర్తి గడ్డ నుంచే కాంగ్రెస్ దోపిడీ పాలనను అంతమొందించే పోరుకు నాంది పలుకాలని వారికి ఉద్బోధించారు.
నాడు చెప్పినట్టే మోసం చేస్తున్నడు..
అసెంబ్లీ ఎన్నికల ముందు అభయహస్తం పేరిట అలవికానీ హామీలిచ్చిన కాంగ్రెస్ ఆచరణలో మాత్రం రిక్తహస్తం చూపుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ‘నిజాయితీ కలిగిన మోసగాడైన రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పిండు.. ప్రజలు మమ్మల్ని నమ్మి మోసపోవాలనుకుంటున్నరు.. రోగి కోరుకున్నది అదే.. డాక్టర్ ఇచ్చింది అదేనని చెప్పిండు.. పాత రోజులు తీసుకొస్తనని మాట ఇచ్చిండు.. నాడు చెప్పినట్టే ఇప్పుడు ఆచరణలో చూపుతున్నడు.. యూరియా బస్తాల కోసం రైతులను లైన్లో నిలబెడుతున్నడు.. కరెంట్ బంద్ పెడుతున్నడు.. రైతుబంధు ఎగ్గొడుతున్నడు’ అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేసీఆర్ నాట్లప్పుడు రైతుబంధు వేస్తే రేవంత్‌రెడ్డి ఓట్లప్పుడు వేస్తున్నారని, ఇప్పటికే మూడుసార్లు ఎగ్గొట్టారని విమర్శించారు. ‘మా దగ్గర ఎవరు గెలిచినా కేసీఆర్ సీఎం అవుతారని ప్రజలు అనుకున్నారు.. ఎవరొచ్చినా సంక్షేమ పథకాలు బంద్ కావని భావించారు’ అని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు జరుగుతు న్నది మన కండ్ల ముందే ఉన్నదని పేర్కొన్నారు. మహబూబాబాద్‌లో చేతి గుర్తుకు ఓటు గుద్ది.. ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తి పత్తాలేకుండా పోయారని ఆరోపించారు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని వ్యాఖ్యానించారు. దగా చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాలోత్ కవిత, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Ktr
ఐలమ్మ ముని మనవరాలికి ఘన సన్మానం
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె ముని మనవరాలు చిట్యాల భాగ్య-శ్రీనివాస్‌ను మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలంగాణ భవన్లో ఘనంగా సన్మానించారు. వీరనారి పోరాటస్ఫూర్తితో ముందుకెళ్లి పాలకుల దోపిడీ విధానాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో ఐలమ్మకు సముచిత గౌరవమిచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో రజక జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కాంబోజు వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ లీగల్ సెల్ బాధ్యురాలు లలితారెడ్డి పాల్గొన్నారు.
సతీశ్‌రెడ్డికి కేటీఆర్ పరామర్శ
శస్త్రచికిత్స చేయించుకున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డిని శనివారం హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఎంపీ రవిచంద్ర, ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు ఉన్నా రు. రోడ్డు ప్రమాదంలో గాయపడి అదే ద వాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నేత ఆర్ సత్యం కుమారుడిని పరామర్శించారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని కేటీఆర్ కొనియాడారు. శనివారం తెలంగాణ భవన్లో ఐలమ్మ జయం తి సందర్భంగా ఆ మహనీయురాలి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ భూమి, భుక్తి, పెత్తందారీ వ్యవస్థ విముక్తి కోసం పోరాడిన వీరనారి అని కీర్తించారు. ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించి కేసీఆర్ సముచిత గౌరవమిచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్, మెచ్చా నాగేశ్వర్రావు, తాటి వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, సుమిత్రానంద్, వాసుదేవారెడ్డి, గాంధీనాయక్, మమత, రజక జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.