రంగారెడ్డి, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్‌సిటీ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి సోదరులు సాగిస్తున్న అక్రమ భూదందాపై జిల్లాలో సదస్సులు నిర్వహించి ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రావిరాలలో ఫ్యాబ్‌సిటీ పక్కన ఫ్యూచర్‌సిటీలో సీఎం సోదరుడు కొండల్‌రెడ్డికి అక్రమంగా కేటాయించిన భూమిని మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గురువారం పరిశీలించి మాట్లాడారు. ముఖ్యమంత్రి, ఆయన సోదరులు కలిసి సాగిస్తున్న అక్రమాలు, భూదందాపై ప్రశ్నిస్తామనే భయంతోనే మమ్మల్ని శాసనసభ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారని కేటీఆర్ అన్నారు.
సీఎం సోదరుడు కొండల్‌రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీకి తుక్కుగూడ వద్ద సుమారు రూ. 200 కోట్ల విలువ చేసే ఐదెకరాల భూమిని రూ.7 కోట్లకే ధారాదత్తం చేశారన్నారు. పరిశ్రమల పేరుతో సేకరిస్తున్న భూములనూ కొల్లగొట్టేందుకు అడ్రస్ లేని కంపెనీలను సృష్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు లక్ష్మి, వివేకానంద్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ యువ నేతలు కార్తిక్‌రెడ్డి, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.