
ఖైరతాబాద్, డిసెంబర్ 1 : డివిజన్లోని రాజ్‌నగర్, మారుతీనగర్, ఎంఎస్ మక్తాలోని నోటరీ స్థలాలను క్రమబద్ధీకరణ చేస్తూ..ఖైరతాబాద్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు శాశ్వత భవనం నిర్మించాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కార్పొరేటర్ పి. విజయారెడ్డి బుధవారం వినతి పత్రం అందజేశారు. రాజ్‌నగర్, మారుతీనగర్, ఎంఎస్ మక్తా బస్తీ వాసులు గత 40 నుంచి 50 ఏండ్ల నుంచి ఇండ్లు నిర్మించుకొని ఆస్తి పన్ను, కరెంటు, మంచినీటి బిల్లులు చెల్లిస్తున్నారని, బుడగ జంగం బస్తీలో కేంద్ర ప్రభుత్వ (రైల్వే శాఖ) స్థలాల్లో క్రమబద్ధ్దీకరణ చేయాలని ఆమె వినతి పత్రంలో కోరారు.
ప్రస్తుతం రాజ్‌భవన్ ఎదురుగా గేటు అవతల ఎంఎస్‌మక్తాలో పీహెచ్సీ ఉండటం వల్ల ఖైరతాబాద్‌కు చెందిన ప్రజలు అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. లైబ్రరీ వెనుక ప్రభుత్వ ఖాళీ స్థలం నిరూపయోగంగా ఉండడంతో, ఆ స్థలం కబ్జాకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఆ స్థలంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కోసం శాశ్వత భవనం నిర్మించాలని కోరారు. మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు.