KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
KTR | నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న 13 ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చినవా? ఒక నర్సింగ్ కాలేజీ ఇచ్చినవా? ఒక నవోదయ పాఠశాల ఇచ్చినవా? ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినవా? ఒక జాతీయ ప్రాజెక్టు ఇచ్చినవా?’ అని నిలదీశారు.
KTR | కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్కటై ఆదిలాబాద్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మౌనంగా ఉంటోందని ఆరోపించారు. ఆదిలాబాద్ రైతు గర్జన సభలో మాట్లాడిన కేటీఆర్.. ‘బడే బాయ్.. చోటే బాయ్ ఇద్దరూ ఒక్కటయ్యారు. దొంగ చీకటి ఒకటైపోయింది. ఇద్దరూ మంచి అండర్‌స్టాండింగ్‌తో వ్యాపారాలు చేసుకుంటున్నారు’ అంటూ కాంగ్రెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నప్పటికీ ఒక్కరోజైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని గట్టిగా నిలదీశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ‘బడే బాయ్.. చోటే బాయ్ దోనో ఏక్ హోగే. బడే మియా తో బడే మియా.. చోటే మియా సుభానల్లా అన్నట్టుగా ఇద్దరూ ఒక్కటైపోయారు. దొందూ దొందే.. ఇద్దరిలో ఎవరినీ నమ్మొద్దు’ అని వ్యాఖ్యానించారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆయన కుటుంబ సభ్యులు తాంసి, బేలా మండలాల్లో ఇండస్ట్రియల్ జోన్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆ దోపిడీకి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సహకరిస్తోందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి దోపిడీ చేస్తుంటే బీజేపీ పెద్దలు కళ్లు మూసుకుని కూర్చుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
‘లచ్చులో లచ్చన్న.. ఈ లుచ్చగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులు’
ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ, మహాకవి గూడ అంజన్న రాసిన పాటను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘లచ్చులో లచ్చన్న.. ఈ లుచ్చగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకాయే లచ్చులో లచ్చన్న’ అంటూ అంజన్న రాసిన పాటలోని పంక్తులను ఉటంకించారు. కేసీఆర్ పాలనలో బంగారంలా మెరిసిన తెలంగాణ.. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మోసాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితికి చేరిందని విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. ‘ఈ మోసగాళ్ల ఉచ్చులో పడి ఆదిలాబాద్ గోస పడుతోంది’ అని వ్యాఖ్యానించారు.
‘15 లక్షలు రాలే.. 15 వేలూ రాలే’
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ హామీ ఎవరికైనా నెరవేరిందా? అని ప్రశ్నించారు. ‘చోటే బాయ్ చెప్పిన రూ.15 వేలు కూడా ఎవరికీ రాలేదు. ఇద్దరూ జూటా మనుషులే’ అని విమర్శించారు. బీజేపీ నేతలు చెప్పే డబుల్ ఇంజన్ పాలనపై కూడా కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఏమన్నా మాట్లాడితే డబుల్ ఇంజన్ అంటారు. ఏం డబుల్ ఇంజన్? అయితే జుమ్లా.. లేకపోతే హమ్లా. అంతే తప్ప డబుల్ ఇంజన్ లేదు.. మన్ను లేదు’ అని ఎద్దేవా చేశారు.
ఆదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నప్పటికీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని ఎందుకు తెరవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. సీసీఐని తుక్కు కింద అమ్ముతున్నా బీజేపీ ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సీసీఐ కోసం పోరాడుతున్నది మాజీ మంత్రి జోగు రామన్న ఒక్కరేనని అన్నారు. గతంలో ఆదిలాబాద్‌కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సీసీఐని తిరిగి ప్రారంభించి, రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘ఆప్ హమారే కో ఓట్ దో.. హమ్ ఆప్కో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జో దో హజార్ లోగో కో నౌకరీ దేగీ.. హమ్ ఉస్కో ఫిర్ సే చాలు కరేంగే’ అని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం సీసీఐని తుక్కు కింద అమ్ముతున్నారని విమర్శించారు. ‘మా జోగు రామన్నకు ఉన్న ఫికర్ మీకెందుకు లేదు ఎమ్మెల్యే గారూ?’ అని పాయల్ శంకర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. సీసీఐకి సావు డప్పు కొడుతున్నా బీజేపీ, కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
చోటే బాయ్ అయిన రాష్ట్ర ప్రభుత్వం సోయా కొనడం లేదని.. బడే బాయ్ అయిన కేంద్ర ప్రభుత్వం కూడా పత్తి కొనుగోళ్లలో రైతులకు అన్యాయం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోసం యాప్ పెట్టిందని, కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లకు ‘కిసాన్ కపాస్’ యాప్ తీసుకొచ్చిందని విమర్శించారు. రెండు ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
‘చోటే బాయ్ ఏమో యూరియా యాప్ పెట్టిండు.. బడే బాయ్ ఏమో కిసాన్ కపాస్ యాప్ అని పెట్టిండు. ఇద్దరూ ఒకటే’ అని వ్యాఖ్యానించారు. గత మూడేళ్లలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే వల్ల ఆదిలాబాద్ రైతులకు ఏమైనా ప్రయోజనం జరిగిందా? అని ఆలోచించాలని రైతులను కోరారు. ‘మంచిగా పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతును తెచ్చుకున్నరు. అది తన్నకేం చేస్తది మరి? అది తంతది’ అంటూ ప్రజల నిర్ణయంపై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు పునరుద్ధరణ.. సీసీఐకి మాత్రం తుక్కు ధరా?
ఆదిలాబాద్‌లో సీసీఐని మూసివేసి, తుక్కు కింద అమ్ముతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. అక్కడి ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉండటమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు. ‘ఈరోజు గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో ఉంటే.. మా సీసీఐని ఎట్లా అమ్ముతావ్? మా ఆదిలాబాద్‌కు ఎట్లా అన్యాయం చేస్తావ్? అని గల్లా పట్టి అడగకపోదురా’ అని అన్నారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ సీసీఐ విషయంలో ఒక్కరూ గట్టిగా మాట్లాడటం లేదని విమర్శించారు. సీసీఐని అమ్ముతున్నా, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని ఆరోపణలు వస్తున్నా ఎంపీలు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
తెలంగాణకు మోదీ ఏం ఇచ్చారు?
నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న 13 ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చినవా? ఒక నర్సింగ్ కాలేజీ ఇచ్చినవా? ఒక నవోదయ పాఠశాల ఇచ్చినవా? ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినవా? ఒక జాతీయ ప్రాజెక్టు ఇచ్చినవా?’ అని నిలదీశారు. తెలంగాణకు ఒక్క ప్రత్యేక ప్రాజెక్టు కూడా ఇవ్వకుండా, రాష్ట్ర ప్రజలు బీజేపీని ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు. ‘ఎందుకు తెలంగాణను ఇంకా దేకాలే? ఎందుకు మా ప్రాంత బిడ్డలు నీకు ఓటేయాలే? ఎందుకు భారతీయ జనతా పార్టీని ఆదిలాబాద్ నమ్మాలే?’ అని ప్రజలను ఆలోచించాలని కోరారు.
తెలంగాణకు కొత్తగా ఏమీ ఇవ్వకపోగా, ఉన్న పరిశ్రమలను కూడా గుజరాత్‌కు తరలిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘ఏం వచ్చింది అన్నది పక్కన పెడితే.. ఉన్నదే పోతున్నది. మన పరిశ్రమలు ఎత్తుకుపోతున్నాడు గుజరాత్‌కు నరేంద్ర మోదీ. ఇది కూడా మర్చిపోవద్దు’ అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, గత మూడేళ్లలో ఆ రెండు పార్టీల వల్ల ఆదిలాబాద్‌కు జరిగిన ప్రయోజనాలు, నష్టాలపై రైతులు, ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
KTR | ఎగ్గొట్టినదానితో కలిపి ఎకరానికి రూ.60వేల రైతుబంధు వెంటనే చెల్లించాలి.. కేటీఆర్ డిమాండ్
KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

