హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో బుధవారం నందినగర్‌లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎల్. రమణ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కేటీఆర్‌కు వివరించింది. అనంతరం కమిటీకి ఆయన పలు కీలక సూచనలు చేశారు.
రాష్ట్రంలో లక్షల మంది ఓటర్ల పూర్తి వివరాలు అందుబాటులో లేకపోవడంతో వారిలో చాలామందిని నోటీసులు జారీ చేసే విభాగంలో చేర్చారని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి ఓటర్లకు నోటీసులు అందిన వెంటనే పార్టీ శ్రేణులు వారికి అవసరమైన మార్గనిర్దేశం చేసి, అర్హులైన వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదని, అదే సమయంలో డూప్లికేట్ లేదా అనర్హ ఓటర్లు జాబితాలో ఉండకుండా చూడాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆగస్టు 3వ తేదీ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమంలో నిమగ్నం కావాలని సూచించారు.
ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదలైన తర్వాత అసలు పని ప్రారంభమవుతుందని పేర్కొన్న కేటీఆర్, జాబితాలో పేర్లు ఉన్నవారు, లేనివారిని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, అర్హులైన వారి పేర్ల నమోదు కోసం క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న జిల్లాలను అభినందించిన కేటీఆర్, దీనిని ఒక యజ్ఞంలా భావించి పార్టీ శ్రేణులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇంచార్జీలు, సభ్యత్వ ఇంచార్జీలు, జనరల్ సెక్రటరీలు, కోఆర్డినేటర్లు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎన్నికల రోజున ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటి నుంచే ప్రతి అర్హ ఓటరును గుర్తించి నమోదు చేయించే బాధ్యతను నిర్వర్తించాలని కేటీఆర్ అన్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బూత్ స్థాయి వరకు పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హ ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హులు లేదా డూప్లికేట్ ఓటర్లు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు.