హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : 2029లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ర్టాన్ని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేయర్స్ కాంక్లేవ్‌కు కేటీఆర్ హజరైన సందర్భంగా మాట్లాడుతూ.. తన కు బాస్కెట్‌బాల్ అంటే ఎంతో ప్రాణమని, ఆ ఆటకు వీరాభిమానినని పేర్కొన్నారు. తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఏర్పాటైనప్పటి నుంచి క్రీడాకారుల సంక్షేమానికి కృషి చేయడం సంతోషకరమని ప్రశంసించారు.
గత బీఆర్ఎస్ పాలనలో అప్పటి అవసరాలు, పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, ఐటీ, ఇండస్ట్రీ రంగాలకు పెద్దపీట వేశామని కేటీఆర్ వివరించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, క్రీడలను ప్రధాన ఎజెండాలో చేర్చుతామని చెప్పారు.
ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను ఆరెస్ట్ చేయ డం దుర్మార్గమని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఖండించారు. ఎన్ని కేసులుపెట్టినా, ఎన్నిసార్లు జైలుకు పంపినా బీఆర్ఎస్ బెదరబోదని చెప్పారు. రేవంత్ సర్కార్ అక్రమాలను ఎండగడుతూనే ఉంటామన్నారు.