కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
ఎల్ నినో వస్తుందని, కరువు ముప్పు పొంచి ఉన్నదని 10 నెలల కిందటే హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి రైతాంగం బలవుతున్నదని మండిపడ్డారు. కరెంట్ రాక, సాగునీరందక అన్నదాతలు అల్లాడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తున్నదని ధ్వజమెత్తారు.
- ఎల్ నినోపై బీఆర్ఎస్ పది నెలల ముందే హెచ్చరించినా పెడచెవిన పెట్టిన ప్రభుత్వం
- తాగునీటికీ కటకటలాడే దుస్థితి వచ్చింది
- ప్రజా సమస్యలను గాలికి వదిలి సీఎం, మంత్రులు లూటీలో పోటీ పడుతున్నరు
- మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే.. సీఎం కేసీఆరే
- ఎన్నికలెప్పుడు పెట్టినా సత్తా చాటుతం
- రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల కుమ్మక్కు
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలే దేశంలో కీలకం కాబోతున్నయ్. తెలంగాణకు కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ కేసీఆర్ ముఖ్యభూమిక పోషించడం తథ్యం. మోసపూరిత కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధిచెప్పేందుకు ప్రజలు వెయ్యికండ్లతో ఎదురు చూస్తున్నరు.
-కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో వస్తుందని, కరువు ముప్పు పొంచి ఉన్నదని 10 నెలల కిందటే హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి రైతాంగం బలవుతున్నదని మండిపడ్డారు. కరెంట్ రాక, సాగునీరందక అన్నదాతలు అల్లాడుతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తున్నదని ధ్వజమెత్తారు. వానకాలంలో వచ్చిన వరదను ఎత్తిపోయకపోవడంతో సాగునీటికే కాదు.. తాగునీటికి సైతం కటకటలాడే దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, అన్ని వర్గాలను కాంగ్రెస్ నిండా ముంచిందని నిప్పులు చెరిగారు.
పాలన చేతగాక, ప్రజలకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన అలవికాని హామీలను నమ్మి మోసపోయిన అన్నివర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నాయని, ఆ పార్టీ దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ అంబర్‌పేట నియోజకవర్గ నేతలతో శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన సమావేశమయ్యారు. రానున్న నగర కార్పొరేషన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఇప్పటినుంచే పట్టభద్రుల ఓటు నమోదుపై దృష్టిపెట్టాలని సూచించారు. సమిష్టిగా ముందుకెళ్లినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని నొక్కిచెప్పారు. 2017 కార్పొరేషన్ ఎన్నికల్లో సెంచరీ కొట్టిన తీరుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
కేసీఆర్‌కు పేరొస్తుందనే కాళేశ్వరంపై కుట్రలు
కాళేశ్వరం పంపులు ప్రారంభించి నీళ్లు ఎత్తిపోస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని, తాము చేసిన అబద్ధపు ప్రచారం ప్రజల ముందు తేలిపోతుందనే ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పెద్దలు కుట్రలు చేశారని కేటీఆర్ విరుచుకుపడ్డారు. మేడిగడ్డ కూలిపోయిందని దుష్ప్రచారం చేశారని మండిప డ్డారు. రాహుల్‌గాంధీని తీసుకొచ్చి మేడిగడ్డ కూలిపోయిందంటూ అబద్ధాలు చెప్పించారని దుయ్యబట్టారు. మేడిగడ్డ కూలిపోలేదని కాంగ్రెస్ వాళ్లే కూల్చివేశారని విమర్శించారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మబోరని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, మరో ఏడాదే రేవంత్‌రెడ్డి హడావుడి ఉంటుందని కేటీఆర్ వివరించారు. తెలంగాణలో లూటీ పాలన నడుస్తున్నదని, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు లూటీ చేసేందుకే పోటీపడుతున్నారని దుయ్యబట్టారు.

కరువుకు కారణం కాంగ్రెస్సే
తెలంగాణలో కరువుకు ముమ్మాటికీ కాంగ్రెస్సే కారణమని కేటీఆర్ విమర్శించారు. నాడు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫొటోలు..ప్రస్తుతం రైతులు ట్యాంకర్లతో నీరందిస్తున్న చిత్రాలను శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేసి కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు. కృష్ణా నదిలో ఈ ఏడాది 250 టీఎంసీల వరద వచ్చినా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పంపులను నడుపలేదని, గోదావరిలో 750 టీఎంసీల వరద వచ్చినా కాళేశ్వరం పంపులు ఆన్ చేయలేదని, ఫలితంగా ఈ రోజు ఎండిపోతున్న పంటలకు రైతులు ట్యాంకర్లతో నీటిని కొనుక్కొచ్చి అందించాల్సిన దుస్థితి నెలకొన్నదని వాపోయారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నయ్. రేవంత్‌రెడ్డి దున్నపోతు ఈనిందంటే కిషన్‌రెడ్డి దూడను కట్టేయిమంటరు. కేసీఆర్‌పై విమర్శలు చేసే విషయంలో ఆ రెండు పార్టీలు ఏకమైనయ్. రాష్ట్రంలో లూటీ పాలన నడుస్తున్నది. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు లూటీ చేసేందుకు పోటీ పడుతున్నరు.
-కేటీఆర్
మోడీ పాలనలో సంక్షోభంలో దేశం
కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి అవసరమని నాలుగేండ్ల క్రితమే కేసీఆర్ చెప్పిన విషయాన్ని కేటీఆర్ ఉటంకించారు. ఆయన చెప్పిన విషయం చాలామందికి అర్థం కాలేదని, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్ చెప్పింది అక్షరాలా సత్యమనే విషయం స్పష్టమవుతున్నదని చెప్పారు. ‘కేంద్రంలో ప్రధాని మోడీ ఏం చేస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నం..ఆయన దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్న పరిస్థితులు కండ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నయ్.. బీజేపీకి ప్రత్యామ్నాయ ఎజెండాలేని కాంగ్రెస్‌ను చూసిన తర్వాత కేసీఆర్ చెప్పింది వాస్తవమని ప్రజలు భావిస్తున్నరు’అని ఉద్ఘాటించారు. ‘రాహుల్‌గాంధీ ఎంతచేసినా లాభంలేకుండా పోతున్నది.. ఎన్ని జాకీలు పెట్టినా లేస్తలేరు. దేశంలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వంపై సీజేపీ రూపంలో యువతీ యువకులు పోరాటం చేస్తున్నరు’ అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, నాయకులను బీజేపీ బెదిరించగలుతుంది, కానీ యువతరాన్ని ఏమీ చేయలేదని తేలిపోయిందని వ్యాఖ్యానించారు.
బలహీనపడ్డ బీజేపీ
పదేండ్లలో ఎన్నడూ లేనంతగా బీజేపీ బలహీనపడ్డదని కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కలిసిపోయి పనిచేస్తున్నారని ఎద్దేవాచేశారు. ‘తెలంగాణ ప్రయోజనాలను విస్మరించి కేవలం కేసీఆర్‌ను, నన్ను తిట్టడమే ఆ రెండు పార్టీ నాయకులు పనిగా పెట్టుకున్నారు’ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని అన్నివర్గాల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ సర్కార్‌కు లేదని స్పష్టంచేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు నమోదు నుంచి ఓటింగ్ దాకా పార్టీ శ్రేణులు దృష్టిసారించాలని హితబోధ చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి నిరుద్యోగులను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్.. వారిని దారుణంగా వంచించిందని దుయ్యబట్టారు. యూత్ డిక్లరేషన్ పేరిట దగా చేసిన ఆ పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టేందుకు నిరుద్యోగ యువత సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ధన బలాన్ని నమ్ముకున్నదని స్పష్టంచేశారు.
వానకాలంలో వచ్చిన వరదను రేవంత్ సర్కార్ ఎత్తిపోయకపోవడం వల్లే రాష్ట్రంలో తాగునీటికి కూడా కటకటలాడే దుస్థితి నెలకొన్నది. దిగువనున్న ఆంధ్రప్రదేశ్, పొరుగునున్న కర్ణాటక అప్రమత్తమై ప్రాజెక్టులను నింపుకొన్నయ్. రాష్ట్రంలోని అసమర్థ కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం ప్రజలకు శాపంగా మారింది.
-కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

