హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాండియాగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ‘టాల్ హెల్త్ ఫెస్ట్-2026’కు ఆహ్వానం అందింది. విశిష్ట అతిథిగా హాజరై అమూల్యమైన సందేశం ఇవ్వాలని టచ్-ఏ-లైఫ్ (టాల్) ఫౌండేషన్ సీఈవో సాయి గుండవెల్లి ఆదివారం ఆహ్వానం పంపారు. అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య, సాంకేతిక ప్రముఖులతో తమ ఆలోచనలు పంచుకోవాలని విజ్ఞప్తిచేశారు. అక్టోబర్ 30న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఈ అంతర్జాతీయ ఆరోగ్య సదస్సు నిర్వహించనున్నారు. వైద్యరంగ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ముఖ్య నాయకులు, ఆరోగ్య నిపుణులు, ఆవిష్కర్తలు, వివిధ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావాలనే సమున్నత లక్ష్యంతో ‘టాల్ హెల్త్ ఫెస్ట్-2026’ను ఏర్పాటు చేస్తున్నారు.
సదస్సులో వైద్యులు, ఆరోగ్యరంగ నిపుణులు, దవాఖానలు, ఫార్మా అండ్ మెడికల్ టెక్నాలజీ కంపెనీల బాధ్యులు, పరిశోధకులు, విద్యావేత్తలు, టెక్నాలజీ ఆవిష్కర్తలు, రోగుల హక్కుల సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులు, మెడికల్ టూరిజం బాధ్యులు హాజరుకానున్నారు. ‘ఆవిష్కరణలు, సాంకేతిక సహకారం, గ్లోబల్ యాక్సెస్ ద్వారా వైద్యరంగ పునర్నిర్మాణం’ అనే ప్రధాన ఇతివృత్తంతో ఇంటర్నేషనల్ హెల్త్ సెమినార్ నిర్వహించనున్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పర్సనలైజ్డ్ మెడిసిన్, డిజిటల్ హెల్త్‌కేర్, ప్రివెంటివ్ కేర్, మెడికల్ టూరిజం, ఆరోగ్య సంరక్షణ డెలివరీలో భవిష్యత్తు ఆవిష్కరణలపై చర్చించన్నారు. తెలంగాణలో సాంకేతిక, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, అంతర్జాతీయ భాగస్వామ్యాల విస్తరణలో కేటీఆర్ చేసిన కృషిని ఫౌండేషన్ సీఈవో సాయి గుండవెల్లి కొనియాడారు. ఈ అంతర్జాతీయ వేదికపై కేటీఆర్ భాగస్వామ్యం ఎంతో విలువైన ఆలోచనలను ఆవిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కేటీఆర్ హాజరుకావడం ద్వారా వైద్యం, సాంకేతికత, ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సేవలకు సంబంధించి భారత్- అమెరికా దేశాల మధ్య పరస్పర చర్చలు, భాగస్వామ్యాలు మరింత బలోపేతమవుతాయని పేర్కొన్నారు.