హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతున్నది. పర్యవేక్షణలోపంతో ఇష్టారీతిగా నిర్ణయాలు తీసుకోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అవుతున్నది. ప్రభుత్వం యూనివర్సిటీలను గాలికొదిలేయడంతో వైస్ చాన్స్లర్లు, రిజిస్ట్రార్లు వారికి నచ్చినట్టుగా నిబంధనలు మారుస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీల్లో వైస్ చాన్స్లర్ల ఆధిపత్య పోరు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. మూడు యూనివర్సిటీలకు కలిపి గత విద్యాసంవత్సరం వరకు ఒకే నోటిఫికేషన్ విడుదలచేసేవారు. ఒకేచోట అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించేవారు. ముందుగా వెటర్నరీ, ఆ తర్వాత అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సులకు కౌన్సెలింగ్ చేపట్టేవారు.
దీనివల్ల వెటర్నరీ కోర్సులో సీటు లభించని అభ్యర్థులు అగ్రికల్చర్, అందులోనూ లభించనివారికి హార్టికల్చర్ కోర్సులో చేరడానికి అవకాశం ఉండేది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా ఒకేచోట కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మూడు యూనివర్సిటీలు వేర్వేరు నోటిఫికేషన్ ఇచ్చి వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాయి. దీంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇలా వేర్వేరుగా చేపడుతున్నట్టు చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్ల దరఖాస్తులు చాలా తక్కువగా వచ్చాయి.
మూడు యూనివర్సిటీలు వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహించడంతో విద్యార్థులు దరఖాస్తు రుసుము కూడా మూడింటికి చెల్లించాల్సి వస్తున్నది. గతేడాది వరకు ఉమ్మడి దరఖాస్తుకు ఎస్సీ, ఎస్టీలకు రూ.1,500, బీసీ, ఓసీ విద్యార్థులకు రూ.3,000 ఉండేది. ఇప్పుడు వెటర్నరీ, అగ్రికల్చర్ యూనిర్సిటీల్లో ఎస్సీ, ఎ స్టీలకు రూ.1,500, ఓబీసీలకు రూ.3,000, హార్టికల్చర్ వర్సిటీ అప్లికేషన్‌కు ఎస్సీ, ఎస్టీలకు రూ.వెయ్యి, ఓబీసీలు రూ.2 వేలు చెల్లించాల్సి వస్తున్నది.
ఒకవేళ రెండింట్లో సీటు వస్తే ఒకదాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి రూ.2,000 అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా మూడు వర్సిటీల నుంచి సీటు మార్చుకోవాలంటే క్యాన్సిలేషన్ ఫీజు చెల్లించాల్సిందే. వీటికి అదనంగా ప్రవేశ రుసుము వెటర్నరీలో రూ.45 వేలు, అగ్రికల్చర్, హార్టికల్చర్‌లో రూ.35 వేలు ఉన్నది. జాయిన్ అయ్యేముందే ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మరో యూనివర్సిటీలో సీటు వస్తే ముందుగా జాయిన్ అయిన వర్సిటీ నుంచి క్యాన్సిలేషన్ చేసుకుంటే రీఫండ్ అవ్వడానికి సుమారు నెల సమయం పడుతుంది. ఈలోపు జాయిన్ అయిన వర్సిటీలో ఆ మొత్తం అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఉమ్మడి కౌన్సెలింగ్ ఉంటే ఈ అయోమయం, అదనపు ఖర్చు ఉండేది కాదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
మరోవైపు మెడిసిన్ కౌన్సెలింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో విద్యార్థులు అటువెళ్లాలంటే మళ్లీ ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. వీసీల మధ్య మనస్పర్థల వల్లనే విడివిడిగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. వెటర్నరీ, అగ్రికల్చర్ వర్సిటీల్లో కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. విద్యార్థులు రెండుచోట్లా తిరుగలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక హార్టికల్చర్ పరిస్థితి దిగజారిపోతున్నది. వర్సిటీలో దాదాపు 300 దాకా సీట్లుంటే కనీసం 200 మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఈ కారణంగా ఇప్పటికే రెండుసార్లు కౌన్సెలింగ్ వాయిదా వేసినట్టు తెలుస్తున్నది.