త్వరలోనే మళ్లీ డీలిమిటేషన్ బిల్లు!
డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ఈసారి పార్లమెంట్లో ఎలాగైనా ఆమోదింపజేసుకొంటామని కేంద్రహోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు.
- ఈ నెలాఖరులో తెస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి సంకేతాలు
- పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ఇంకా ప్రొరోగ్ కాలేదు
- ప్రత్యేక సెషన్‌కు 48 గంటల ముందు నోటీస్ ఇస్తే చాలు
- 15-18 ఓట్లతో బిల్లు గట్టెక్కుతుందని అమిత్‌షా ఆశాభావం
- ఈ నెల 24, 25 తేదీల్లో సమావేశాలు ప్రారంభమయ్యే చాన్స్
- 3 రోజులపాటు కొనసాగవచ్చంటున్న అధికారవర్గాలు
డీలిమిటేషన్ బిల్లును ఈసారి పార్లమెంట్లో ఎలాగైనా ఆమోదింపజేసుకొంటాం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి కావాల్సిన మూడింట రెండో వంతు మెజారిటీ కంటే మాకు 15-18 ఓట్లు ఎక్కువే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 13న పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడినా ప్రొరోగ్ అయినట్టు ఇంకా ప్రకటన విడుదల చేయలే.. ఈ నెల 24 లేదా 25 తేదీల్లో పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపరిచి.. మూడు రోజుల వ్యవధిలో డీలిమిటేషన్‌తో పాటు మహిళా బిల్లును కూడా ఆమోదింపజేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఇవే సమావేశాల్లో విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి (ఎఫ్సీఆర్ఏ) సంబంధించిన సవరణ బిల్లును కూడా తీసుకొస్తాం.
– కేంద్ర హోంశాఖ మంత్రి మిత్షా
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ఈసారి పార్లమెంట్లో ఎలాగైనా ఆమోదింపజేసుకొంటామని కేంద్రహోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమన్న అమిత్ షా.. కావాల్సిన మెజారిటీ కంటే తమకు 15-18 ఓట్లు ఎక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆగస్టు 13న పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడినప్పటికీ.. సమావేశాలు ముగిసిపోయినట్టు (ప్రొరోగ్ అయినట్టు) ఇంకా ప్రకటన విడుదల చేయని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం ప్రొరోగ్ కాని సందర్భంలో సభ్యులకు 48 గంటల ముందు (రెండు రోజుల ముందు) నోటీసులు ఇస్తే సరిపోతుందని షా తెలిపారు.
త్వరలో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చి బిల్లును ప్రవేశపెడుతామని మీడియా మిత్రులతో నిర్వహించిన ఓ అనధికార భేటీలో అమిత్ షా పేర్కొన్నారు. ఇవే సమావేశాల్లో విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి (ఎఫ్సీఆర్ఏ) సంబంధించిన సవరణ బిల్లును కూడా తీసుకొస్తామని వెల్లడించారు. కాగా, ఈ నెల 24 లేదా 25 తేదీల్లో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి.. మూడు రోజుల వ్యవధిలో డీలిమిటేషన్‌తో పాటు మహిళా బిల్లును కూడా ఆమోదింపజేయడానికి అధికార ఎన్డీయే కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు అధికారవర్గాలు పేర్కొన్నాయి.
91 రోజులుగా ప్రొరోగ్

గత ఆగస్టు 13న పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆ తర్వాత సమావేశాల ముగింపు గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పార్లమెంట్ ప్రొరోగ్ (అధికారికంగా నిలిపివేత లేదా వాయిదా) కాకుండా గురువారం నాటికి 91 రోజులు గడిచిపోయాయి. దీంతో 2008 నాటి సమావేశాల కాలంలో 87 రోజుల పాటు ప్రొరోగ్ అవకుండా ఉన్న రికార్డు బద్దలైంది. సాధారణంగా సభలను ఉభయ సభాపతులు నిరవధికంగా వాయిదా వేసిన రెండు, మూడు రోజుల్లో సమావేశాలు ముగిసినట్టు (ప్రొరోగ్ అయినట్టు) రాష్ట్రపతి ప్రకటన విడుదల చేస్తారు.
అయితే, ఇప్పటికీ అది జరుగలేదు. దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పొడిగించే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా ప్రభుత్వం నిర్ణయించడం వెనుక డీలిమిటేషన్ బిల్లు ఉన్నట్టు అధికారవర్గాలు ఇచ్చిన తాజా సమాచారాన్ని బట్టి అర్థమవుతున్నది. లోక్‌సభ సీట్లను 543 నుంచి గరిష్ఠంగా 850కు పెంచేందుకు ఉద్దేశించిన ఈ ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లును ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ప్రొరోగ్ చేయని సందర్భంలో సమావేశాల కాలాన్ని పొడిగించాలన్నా లేదా ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలన్నా కనీసం 48 గంటల ముందు సభ్యులకు నోటీస్ ఇస్తే సరిపోతుంది. అదే కొత్తగా సమావేశాలు నిర్వహించాలంటే కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. అందుకే, తక్కువ సమయం అంటే 2 రోజుల ముందు సభ్యులకు నోటీసు జారీ చేసి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కేంద్రం ‘ప్రొరోగ్’ వ్యూహాన్ని అవలంబిస్తున్నట్టు సంబంధితవర్గాల ద్వారా తెలిసింది.
మ్యాజిక్ ఫిగర్ ఇలా..
డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందాలంటే పలు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అలా రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టే బిల్లులకు ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. సభలో సభ్యుల హాజరు సగానికి (50%) పైగా ఉండాలి. హాజరైన వారిలో మూడింట రెండు వంతుల మంది ఆ బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు ఆమోదం పొందుతుంది. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 540 మంది ఎంపీలు సభకు హాజరైతే.. వారిలో 361 మంది తప్పనిసరిగా బిల్లుకు మద్దతు తెలపాలి.
లోక్‌సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభ ముందుకు వస్తుంది. రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న 244 మంది సభ్యులు సభకు హాజరైతే.. 163 మంది బిల్లుకు మద్దతు తెలపాలి. అప్పుడే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టంగా మారుతుంది. అధికార ఎన్డీయేకి ఉభయ సభల్లో ఇప్పుడు అంత బలం లేదు. లోక్‌సభలో ఎన్డీయేకి ప్రస్తుతం 319 (20 మంది టీఎంసీ ఎంపీలు, ఆరుగురు శివసేన ఎంపీలతో కలిపి) మంది సభ్యుల మద్దతు ఉండగా, రాజ్యసభలో 151 మంది సభ్యుల మద్దతు ఉంది. కానీ, 15-18 ఓట్ల మెజార్టీతో ఈసారి బిల్లు తప్పకుండా గట్టెక్కే అవకాశం ఉన్నదని అధికార కూటమి నేతలు ధీమాతో ఉన్నారు.
ఈ క్రమంలోనే మరోసారి బిల్లును కేంద్రం తీసుకొస్తున్నట్టు తెలుస్తున్నది. కాగా, తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్-డీఎంకే కూటమి విచ్ఛిన్నమవ్వడంతో బిల్లుకు విస్తృత మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్రం డీఎంకేను సంప్రదించే ప్రయత్నాలను ప్రారంభించినట్టు సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో 8 మంది ఎంపీల బలమున్న ఎన్సీపీ (ఎస్పీ)తో కూడా బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. వీళ్ల మద్దతుతో పాటు తటస్థంగా ఉన్న మిగతా పార్టీల మద్దతును కూడగట్టి ఈసారి బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని కేంద్రం పట్టుదలతో ఉన్నట్టు సంబంధితవర్గాల ద్వారా తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

