హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న హరీశ్‌రావు, కే తారకరామారావు బల్లలు దుంకారు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, నాడు ఎన్నిసార్లు బల్లలు దుంకినా అది తెలంగాణ కోసమేనని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో కేటీఆర్, హరీశ్‌రావు బల్లలపై నుంచి దుంకి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శనివారం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి వేముల కౌంటర్ ఇచ్చారు. నాడు తెలంగాణ సాధన కోసం జరిగిన కొట్లాటలో భాగంగానే అవన్నీ చేశారని సమర్థించారు. కాంగ్రెస్ సభ్యులకు సమయం ఇవ్వడం లేదన్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. గతంలో ప్రతిపక్షాలకు ఇచ్చిన సమయం కన్నా తాము ఎక్కువ ఇస్తున్నట్టు స్పష్టంచేశారు. గతంలో పద్దుల బిల్లులను చర్చ లేకుండానే ఆమోదించేవారని, ఇప్పుడు ప్రతిపక్షాల సందేహాలను నివృత్తి చేసిన తర్వాతే ఆమోదిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో రోజుకు గంటన్నరకు మించి సభ నడపలేదని, ఎమ్యెల్యేలు ఉదయం అలా వచ్చి ఇలా వెళ్లే వారని, మధ్యాహ్నం నిజాంక్లబ్‌లో లంచ్ చేస్తూ ఎంజాయ్ చేసే వారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తక్కువ రోజులు సభ నడిపినా ప్రతిరోజూ 6-7 గంటలపాటు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు సభ ఎక్కువ రోజులు నడపడం లేదని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గతంలో సీఎం కేసీఆర్ వద్దకు వచ్చి.. అసెంబ్లీ సమావేశాలు చాలని, ఇక పొడగించొద్దని కోరారని మంత్రి పేర్కొన్నారు.