
హైదరాబాద్, జనవరి 10(నమస్తే తెలంగాణ): పంజాబ్ యువ చెస్ చాంపియన్ మలికా హండాకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మద్దతుగా నిలిచారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు కొల్లగొట్టిన మలిక.. సొంత రాష్ట్రం పంజాబ్ తో పాటు కేంద్ర ప్రభుత్వ నిరాదరణకు గురైన వేళ తానున్నానంటూ కేటీఆర్ ఆపన్న హస్తం అందించారు. పుట్టుకతోనే చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతున్న మలికకు ఇచ్చిన హామీ మేరకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేశారు. సోమవారం తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చిన మలికకు మంత్రి కేటీఆర్ రూ.15 లక్షలతో పాటు భవిష్యత్ టోర్నీలకు సన్నద్ధమయ్యేందుకు ల్యాప్‌టాప్ అందజేశారు. చెస్‌లో మలిక ప్రతిభను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా కోరారు. ఈ సందర్భంగా మలిక కుటుంబ సభ్యులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉంటే గత కొన్నేండ్లుగా చెస్‌లో నిలకడగా రాణిస్తున్న మలిక ప్రతిభను గుర్తించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైంది. అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణించినా..తోడ్పాటు అందించలేదు. ఏండ్లకేండ్లు చూసి విసిగివేసారిన ఈ యువ చెస్ ప్లేయర్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్ సర్కార్ వైఖరిని విమర్శించింది. అయితే మలిక కష్టాన్ని గుర్తించిన మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ఈ చాంపియన్ వివరాలు అందిస్తే తాను సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.