Meher Rameash | టాలీవుడ్లో దర్శకులు నటులుగా మారడం కొత్త విషయం కాదు. గతంలో కె. విశ్వనాథ్, దాసరి నారాయణరావు వంటి దిగ్గజాలు కెమెరా ముందు కూడా తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు అదే బాటలో ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ మరోసారి నటుడిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలో ఆయన కనిపించనున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. మెహర్ రమేష్ దర్శకుడిగా కాకముందే నటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. 2002లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘బాబీ’ సినిమాలో ఆయన ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పూర్తిగా దర్శకత్వంపై దృష్టి సారించిన మెహర్ రమేష్, 2004లో కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌తో ‘వీర కన్నడిగ’ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
దర్శకుడిగా టాలీవుడ్లో ఎన్టీఆర్‌తో ‘కంత్రి’, ‘శక్తి’, ప్రభాస్‌తో ‘బిల్లా’, వెంకటేష్‌తో ‘షాడో’ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. వీటిలో ‘బిల్లా’ మాత్రమే కమర్షియల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోగా, మిగిలిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ చిత్రాన్ని రూపొందించారు. తమిళ హిట్ మూవీ వేదాళం కు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ‘భోళా శంకర్’ తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న మెహర్ రమేష్, ఇప్పుడు నటుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో కథకు ఎంతో కీలకమైన పాత్రను ఆయన పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన కొంత భాగం చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో ఆయన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుందని, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా డిజైన్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా పేరు, పాత్ర వివరాలు మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు. నటుడిగా రీఎంట్రీ ఇస్తూనే దర్శకుడిగా కూడా మెహర్ రమేష్ కొత్త కథలపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోలకు సరిపోయే కథలను సిద్ధం చేస్తూ, మరోసారి మెగాఫోన్ పట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దర్శకుడిగా ఎన్నో అనుభవాలు సంపాదించిన మెహర్ రమేష్, ఇప్పుడు నటుడిగా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కొత్త ఇన్నింగ్స్ ఆయనకు ఎంతవరకు కలిసి వస్తుందో, నటుడిగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారో తెలియాలంటే అధికారిక ప్రకటనతో పాటు సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.