Rajpal Yadav | ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు గట్టి షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసుల్లో ఆయనకు విధించిన జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఈ కేసుల పూర్వాపరాలను పరిశీలించిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. రాజ్‌పాల్ యాదవ్‌కు మూడు నెలల సాధారణ జైలు శిక్షను ఖరారు చేస్తూ శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. దీంతో పాటు బాధితుడు దాఖలు చేసిన ఏడు వేర్వేరు ఫిర్యాదులకు గానూ, ప్రతి కేసులోనూ రూ. కోటికి పైగా మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని నటుడిని కోర్టు ఆదేశించింది. అయితే, రాజ్‌పాల్ యాదవ్ ఇప్పటికే చెల్లించిన సుమారు రూ.2 కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ తుది చెల్లింపుల్లో సర్దుబాటు చేయనున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు వీలుగా నటుడికి రెండు నెలల సమయాన్ని కోర్టు మంజూరు చేసింది.
ఒక సినిమా నిర్మాణ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ వివాదం చోటుచేసుకోగా, సదరు సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో నటుడు భారీ నష్టాలను చవిచూశారని ఆయన తరపు న్యాయవాది గతంలో కోర్టుకు తెలిపారు. అంతకుముందు ఈ వ్యవహారంలో 2018 నాటి మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును, ఆ తర్వాత 2019 నాటి సెషన్స్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ యాదవ్ దంపతులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ తుది తీర్పును వెలువరించింది. కోర్టుకు ఇచ్చిన హామీల ప్రకారం డబ్బులు తిరిగి చెల్లించడంలో రాజ్‌పాల్ యాదవ్ పదే పదే విఫలమవడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ శిక్షను ఖరారు చేసింది.