న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో జరిగిన విరాళాల(Ram Temple Donations) చోరీపై నమోదు అయిన పిటీషన్లపై జూలై 13వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. రామాలయ నిధుల చోరీ కేసులో అరెస్టు అయిన 8 మందిని ఒక్క రోజు కస్టడీలోకి తీసుకోవాలని జూలై 7వ తేదీన అయోధ్య కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుశ్ మిశ్రా, కరుణేశ్ పాండేలను రిమాండ్‌లోకి తీసుకోవాలని కోర్టు సూచించింది. జూన్ 29వ తేదీన స్థానిక కోర్టు 8 మంది నిందితులను 14 రోజుల జుడిషియల్ కస్టడీకి ఆదేశించింది. అయితే ఈ అంశంపై దాఖలైన మూడు పిటీషన్లను సుప్రీంకోర్టు విచారించనున్నది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీతో కూడిన ధర్మాసనం ఆ పిటీషన్లను పరిశీలించనున్నది. అయోధ్య ఘటనలో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని నరేంద్ర కుమార్ గోస్వామి అనే పిటీషనర్ సుప్రీంను ఆశ్రయించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు చెందిన కాగ్ ఆడిట్ వివరాలను వెల్లడించాలని కోరారు. ఇదే కేసులో అజయ్ కుమార్ రాయ్, దినేశ్ కుమార్ యాదవ్ కూడా పిటీషన్లు వేశారు.