హైదరాబాద్/నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డిది అసత్యాల వరద, అబద్ధాల బురద అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలోని పేదల ఖాతాల్లో వెంటనే రూ.లక్ష కోట్లు వేస్తానంటే తమ పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తామని స్పష్టంచేశారు. ‘రేవంత్‌రెడ్డికి ఇకనైనా తన పిచ్చి ప్రచారాన్ని మానుకొని వెంటనే ముకునేలకు రాసి క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉన్నదంటూ ఇంతకాలం చేసిన ప్రచారం బెడిసికొట్టడంతో ఇప్పుడు లక్ష కోట్ల భూములంటూ కొత్త ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం 67 ఎకరాల్లో ఉన్నదని రేవంత్‌రెడ్డే అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకొని.. మళ్లీ కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతున్నాడని మండిపడ్డారు. వెయ్యి రోజుల పా లనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు, 22ఏ భూముల అంశం నుంచి నాలుగు కోట్ల ప్రజల దృష్టిని ఇలాంటి ఆరోపణలతో మళ్లించలేరని హెచ్చరించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందంటూ ఇలానే దుష్ప్రచా రం చేశారని మండిపడ్డారు.
ఇప్పటివరకు ఒక పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయారని గుర్తుచేశారు. కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ మరోసారి ఆరోపణ లు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మబోరని చెప్పారు. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు విచారణకు నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్ శుక్రవారం హాజరయ్యారు. అనంతరం గేటువద్ద మీడియాతో మాట్లాడుతూ తులం బంగారం ఇస్తానని మహిళలలను, రైతు భరోసా పేరిట రైతులను, ఉద్యోగాలివ్వక యువతను కాంగ్రె స్ దగా చేస్తున్నదని మండిపడ్డారు. కోర్టుల చుట్టూ తిప్పాలనే యోచనతో తనపై, నేతలపై తప్పుడు కేసులు బనాయించేందుకు రేవంత్ ప్రేరేపిస్తున్నాడని, కోర్టులపై తమకు గౌరవమున్నదని చెప్పారు. కోర్టులు న్యాయబద్ధమైన తీర్పులిచ్చి రక్షిస్తున్నాయని తెలిపారు.
ప్రతిపక్షపార్టీగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపై సర్కార్‌ను నిలదీస్తూనే ఉంటామని కేటీఆర్ హెచ్చరించారు. కేసీఆర్‌ను, పార్టీ నేతలను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయాలని కంకణం కట్టుకున్నదని విమర్శించారు.
కేసులో ఉన్న నలుగురు నిందితులు మాజీ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డి (మాజీ చీఫ్ ఇంజినీర్), గోవేద కిరణ్ మల్లేశ్వరరావు (స్పోర్ట్స్ కన్సెల్టెంట్) కోర్టుకు హాజరుకాగా వీరి తరఫున న్యాయవాది వకా ల్తా దాఖలు చేశారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ (యూకే సంస్థ)కు సమన్లు జారీ అయినా ఇప్పటివరకు సదరు సంస్థ తరఫున ప్రతినిధి కోర్టుకు హాజరుకాలేదు. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను నిందితులకు ఇవ్వాలని న్యా యవాది అశోక్‌రెడ్డి కోర్టును కోరగా అందించాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. అనంతరం విచారణను వచ్చే నెల 30కి వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు జడ్జి హారిక ఉత్తర్వులు జారీ చేశారు.
పవిత్రమైన అసెంబ్లీలో అసత్యాలు, అభూతకల్పనలతో మాట్లాడి చట్టసభ గౌరవానికి ప్రభుత్వ పెద్దలు భంగం కలిగించారని కేటీఆర్ మండిపడ్డారు. 22ఏ కింద కోటీ 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడం వెనుకే సీఎం చెప్తున్న లక్ష కోట్ల భూముల కుంభకోణం దాగి ఉన్నదని విమర్శించారు. అక్రమ దందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చారని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రికి దోచుకోవడం, కుంభకోణాలు చేయడం తప్ప పరిపాలన చేతకాదని ప్రజలకు అర్థమైందని ఎద్దేవాచేశారు. తెలంగాణ ప్రజల సాక్షిగా దోచుకున్న ప్రతి పైసాను కకిస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పెద్దల అవినీతి, అక్రమాలు, కుంభకోణాలన్నింటినీ బయటపెడతామని హెచ్చరించారు.