ములుగు : ములుగు(Mulugu) మున్సిపాలిటీలో పనిచేస్తూ పెండింగ్ వేతనం రాకపోవడంతో కార్మికుడు మైదం మహేశ్ పురుగుల మందు తాగి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కార్మికుడి మృతిపై బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరా తీశారు. ఈ మేరకు రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం మాధవరావుపల్లిలోని మృతుని ఇంటికి చేరుకొని పరామర్శిం చారు. విషయాన్ని కేటీఆర్‌కు ఫోన్లో తెలియజేయగా కేటీఆర్ మృతుని తల్లితో మాట్లాడి మైదం మహేశ్ చనిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
డబ్బులు లేక బిడ్డ చనిపోయింది..
ఈ మేరకు మృతుని తల్లి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడుతూ.. గత 6 నెలలుగా వేతనం రాకపోవడంతో మన స్థాపం చెంది మృతి చెందాడని తెలియజేశారు. తన కొడుకుకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారని, గతంలో ఒక పాపకు జ్వరం వస్తే కూడా జీతం రాకపోవడంతో..పైసల కోసం తిప్పలు పడితే ఒక రెండు వేలు మాత్రమే ఇచ్చారని, ఆ సమయంలో అవి సరిపోక బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలులగా జీతం పైసలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ స్మశానంలో పనిచేయించారని, ఇంట్లో భార్య పిల్లలు, తిండి టికాన లేక అవస్థలు పడ్డారని వాపోయింది.
కొన్ని రోజుల క్రితం మరో బిడ్డకు జ్వరం వస్తే బయట రెండు వేల రూపాయలు బాకీ తెచ్చి దవాఖానలో చూపించాడని తెలిపింది. జీతం కోసం తిరిగి తిరిగి బాధకు గురైన నా కొడుకు మున్సిపాలిటీ వాళ్లు స్మశాన వాటిక కోసం ఇచ్చిన గడ్డి మందును తాగి చనిపోయాడని తెలిపింది. దీంతో కేటీఆర్ మనసు చలించిపోయి దిగ్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేసీఆర్ తరఫున ముగ్గురు ఆడబిడ్డలను ఆదుకుంటామని, పార్టీ తరఫున పిల్లల పేర్లపై ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.
అధైర్యపడొద్దు అండగా ఉంటా..
రెండు రోజుల్లో సతీశ్‌రెడ్డితో సాయం అందిస్తారని అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. గతంలో ఇలాంటి ఇబ్బందులు ఉండేవా? అని కేటీఆర్ అడిగిన క్రమంలో మహేశ్ తల్లి గతంలో ఇలా జీతం కోసం ఇబ్బందులు పడలేదన్నారు. ఆరు నెలల నుండి తన కొడుకు చేసిన కష్టం, పైసల కోసం గోస పడ్డాడని తెలిపింది. అనంతరం మృతుని అన్న కుమార్తె మైదం జ్యోతి మహేశ్‌తో చనిపోయే ముందు ఎవరు లేని సమయంలో వచ్చి వీడియో తీయించుకున్నారని, నీళ్లు అనుకొని మందు తాగినట్లు చెప్పించారని సతీశ్‌రెడ్డి దృష్టికి తీసుకుకెళ్లింది.