తల్లి మనసు లేకున్నా
నీటి మనసన్నా ఉండాలి
పుట్టడం గొప్ప కాదు
జన్మనిచ్చిన నేల నవ్వాలి
మా నాయన కర్మకాండల
స్నానానికి నీళ్లు లేవని
నెత్తిన పిడికెడు నీళ్లు చల్లుకున్నానని
అసెంబ్లీలో వగలేడ్పులు!!
రెండేండ్లుగా పాలమూరు ప్రాజెక్టు దిక్కు
మొఖం మలపలే ఇంగా-
డీపీఆర్‌ల కాడనే లక్కీజువ్వాటలు!
మహాభారతం కన్నా
పాలమూరు కరువు భారతం ప్రపంచానికి ఎరుక
రామాయణంల సీత గాథ కన్నా
వలస దుఃఖం వర్ణించరానిది!
పెండ్లి పందిరి దించకముందే
దేశం బండెక్కిన కొత్త పెండ్లి జంటలు!!
వయస్సు ఉడిగిన అమ్మయ్యల
ఇంటి తాళాలు జేసి
సీజనెల్లా మన్ను మోసి తిరిగిరాని పానాలు!
వలస బతుకులన్నీ కన్నీటి కాలువలు!
మేఘాలయ ఎక్కడ?
అమ్రబాద్, లింగాల అంబటిపల్లెలెక్కడ?
ఇల్లిల్లు శోకాల కమురు వాసనలు
మనుషులే గాదు
పొలాలు మామిడి పీసుల్లా ఎండిపోయినవి.
బోర్లు పడక చెరువులెండి
సేతానం మంట్లగలిసిన సంగతి
పొలాల్లో పిడికెడు మట్టిని తీసుకో
ఆకలి కథలు బొక్కెనలా చేది చెప్తది!
నిందించడానికి ద్వేషించడానికి రెండేళ్లు!
నీటి మీద కేటాయింపులు పలుగుదేలిన పొలాలు
పాలమూరు పట్ల పినతల్లి ప్రేమలు!
అప్పుడు నీ గురువు! ఇప్పుడు నీవు!!
‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచె
పాలమూరులోన’ అంటూ
పాతగోడలన్నీ టేపు రికార్డులై వలసను వలపోస్తవి
ఎడతెగని పాలమూరు దుఃఖం!
చెట్టులేని తోవలున్నా
చెరువులేని ఊరు లేదు
కాకతీయుల చేతి చలువలు
ఊరూరా నీటి తిత్తులు!
ముప్ఫై ఏండ్లయినా
నిండని గణప సముద్రం చెరువు!
అరవై ఏండ్ల వంచనకు నిలువుటద్దం!!
నీళ్లు లేని ఊరికి పిల్లనిచ్చే దిక్కులేదు!!!
పద్నాలుగేండ్ల ఉక్కు సంకల్పం
ప్రజా ఉద్యమ ఫలితం తెలంగాణ రాష్ట్రం!!
నీటి హక్కులకు రెక్కలు తొడిగి
పునర్నిర్మాణంలో మిషన్ కాకతీయ
మిషన్ భగీరథ జలక్షేత్రాలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మోక్షం!!
అవకాశాలు
అహంకారం ఎల్లగక్కడానికి కాదు
ఆత్మగౌరవం నక్షత్రంలా నిలబడాలి
చరిత్రకు రెండే పేజీలు బొమ్మా బొరుసు
వినిర్మాణం విధ్వంసం!
కడుపు గాలిన నేల ఇది-
అన్నింటిని యాదుంచుకుంటది!!