Jamili Elections | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ (జమిలి ఎన్నికలు) నిర్వహణకు కోవింద్ కమిటీ సానుకూల నివేదికను ఇవ్వడంతో త్వరలోనే దీనిపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తున్నది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు సాధ్యమా? ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ఏయే ప్రొసీడింగ్స్‌ను అనుసరించాల్సి ఉంటుందన్న దానిపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
ఏమిటీ జమిలి ఎన్నికలు?
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్‌సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం.
గతంలో జరిగినా.. ఆ తర్వాత వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్‌సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుపడం మొదలైంది.
ప్రక్రియ పెద్దదే
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ర్టాలు చట్టసభలను గడువు కంటే ముందే రద్దుచేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాలవ్యవధిని పొడిగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి, జమిలి ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలు జరుగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్ కమిటీ తాజా నివేదికలో స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83(2), ఆర్టికల్ 172(1), ఆర్టికల్ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏ ఆర్టికల్/నిబంధన ఏం చెబుతున్నది?
ఆర్టికల్ 356: రాష్ర్టాల అసెంబ్లీలను రద్దుచేసే అధికారం కేంద్రానికి ఉన్నది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది. ఒకవేళ, వేరే సందర్భంలో చట్టసభ రద్దుకు నిర్ణయిస్తే, అది రాజ్యాంగ విరుద్ధమే అనిపించుకొంటుంది.
ఆర్టికల్ 172 (1): అసెంబ్లీ కాలవ్యవధి ఐదేండ్లుగా కొనసాగుతుంది. అత్యయిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాలవ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు. సభ తొలిసారిగా సమావేశమైన నాటినుంచి కాలపరిమితి మొదలౌతుంది.
ఆర్టికల్ 324: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. సమయానుసారం, రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాలవ్యవధిని సహేతుక కారణాలతో సవరించాల్సి ఉంటుంది.
ఆర్టికల్ 83(2): ప్రజాతీర్పుతో కొలువుదీరిన లోక్‌సభ కాలవ్యవధి ఐదేండ్లు. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలులేదు.
ఆర్టికల్ 83: పెద్దల సభ కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్ 83 సూచిస్తుంది. దీంతో పాటు రాజ్యాంగంలోని 2,3 చాప్టర్స్, పార్ట్-15లోని పలు అంశాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలు కలిపి మొత్తం 18 అంశాలను జమిలి బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది.
ఆమోదం లభించడం సులభమేమీ కాదు
జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం 67 శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ర్టాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 67 శాతం (362 ఎంపీలు) మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం (164 ఎంపీలు) ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ర్టాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉన్నది.
లా కమిషన్ ‘జర్మనీ’ ఉదాహరణ
రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం ప్రస్తావన కచ్చితత్వంతో లేదు. లోక్‌సభ విధివిధానాల్లోని 198వ నిబంధనలో మాత్రమే దాన్ని ప్రస్తావించారు. 50 లేదా అంతకంటే ఎక్కువమంది చట్టసభ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గితే ప్రభుత్వం గద్దె దిగాల్సి ఉంటుంది. ఏ వర్గమూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థితిలో లేనప్పుడు సభను రద్దుచేసి మధ్యంతర ఎన్నికలు జరుపడమే మార్గం. మరి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనిపై 1999లో లా కమిషన్ ఓ సిఫారసు చేసింది. ఈ మేరకు జర్మనీ రాజ్యాంగాన్ని ఉదహరించింది. దాని ప్రకారం.. జర్మనీలో అవిశ్వాస తీర్మానంతో పాటు విశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెడతారు. అంటే, ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించేవారు ఎవరు నెగ్గుతారో కూడా చెప్పాలి. ఈ రెండు తీర్మానాలను సభ ఆమోదించిన తర్వాత అధ్యక్షుడు కొత్త చాన్సలర్‌ను నియమిస్తారు. ప్రభుత్వాలు మారినా ఐదేండ్లపాటు సభ కొనసాగుతుంది. అయితే, జర్మనీలో అధ్యక్ష పాలన అమల్లో ఉన్నది. మనది ప్రజాస్వామ్య దేశం. దీంతో ఈ సిఫారసును పక్కనబెట్టారు.
లాజిస్టిక్స్ సమస్య
జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే లాజిస్టిక్స్ సమస్య అడ్డంకిగా మారుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎం యంత్రాలతో పాటు వందశాతం వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్యని అంటున్నారు. ఎన్నికల సామగ్రిని భద్రపరుచడానికి తగినన్ని గోదాములు కూడా సమస్యగా మారింది. 15 ఏండ్లకోసారి ఈవీఎంలను మార్చాల్సి ఉంది. ఈవీఎంలలో 40% వరకు డెడ్‌లైన్ దాటినవేనని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 2009 లోక్‌సభ ఎన్నికలకు రూ. 1,115 కోట్లు, 2014లో రూ. 3,870 కోట్లు ఖర్చు కాగా 2019లో ఈ ఖర్చు పది వేల కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ర్టానికి రూ. 250 కోట్లు ఖర్చవుతుందనుకుంటే, మొత్తం 28 రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్‌సభ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు కలిపి అయ్యే ఖర్చు పెద్దమొత్తంలో ఉంటుందని, ఇది సాధ్యమయ్యే పనికాదని పలువురు చెప్తున్నారు.
ఉభయ సభల్లో ఎన్డీఏ బలాబలాలు