హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆందోళన వ్యక్తంచేశారు.
తెలంగాణ అంతటా మునుపెన్నడూ ఇలాంటి ఎన్నికలు జరుగలేదని, తన రాజకీయ జీవితంలో తానెప్పుడూ చూడలేదని దు య్యబట్టారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు, ఓట్ల లెక్కింపు వరకు కాంగ్రె స్ గూండాయిజంతోనే ఎన్నికలు నిర్వహించిందని, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు. నామినేషన్ల దశ నుంచే బీఆర్ఎస్ నాయకులను అధికార కాంగ్రెస్ నాయకులు అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు దిగారని, లేకుంటే కేసులు పెడుతామని హెచ్చరించారని కోరుకంటి చందర్ తెలిపారు.
రామగుండం కార్పొరేషన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగలేదని, అందుకే అక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. స్ట్రాంగ్ రూముల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేశారని, అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేని పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. రామగుండంలో జరిగిన ఎన్నికల తీరుపై సుమోటోగా ఎన్నికల సంఘం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారని, పోలీస్స్టేషన్లకు కాంగ్రె స్ కార్యాలయం అని పేరు పెట్టుకొంటే సరిపోతుందని దుయ్యబట్టారు. రామగుండంలో జరిగిన ఎన్నికల తీరుపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు, అనంతర పరిణామాలపై తెలంగాణ మేధావులంతా మేల్కొనాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. అధికార కాంగ్రెస్ నాయకుల దుర్మార్గాలను ఖండించాలని కోరారు. క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు స్పష్టమైన అధిక్యం వచ్చినా, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడంతోపాటు అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. అక్కడ తమ పార్టీ నాయకులపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు వంటిదని మండిపడ్డారు. ఇలాం టి దాడులు, దౌర్జన్యాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వ స్తుందని చందర్ హెచ్చరించారు. సమావేశంలో రామగుండం బీఆర్ఎస్ నేత బొడ్డు రవీందర్ పాల్గొన్నారు.