వరంగల్, జూన్ 20 : భద్రకాళీ అమ్మవారికి బోనంపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తలోమాట మాట్లాడుతున్నారు. అధికార పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వందల ఏళ్ల చరి త్ర కలిగిన భద్రకాళీ ఆలయంలో ఏనాడూ బోనం సమర్పించే సంప్రదాయం లేదని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అంటుండగా.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆగమ శాస్త్రం ప్రకారమే బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పడం ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రజల విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశాన్ని వివాదాస్పదంగా మార్చడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని, సురేఖల మధ్య ఇది విభేదాలకు తెరలేపింది. ఇద్దరి మధ్య సాగుతున్న మాటల పర్వం ఆలయంపై ఆధిపత్యం కోసం చేస్తున్న పోరుగా ఉన్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వరంగల్ ప్రజల ఇలవేల్పు దైవమైన భద్రకాళీ అమ్మవారికి బోనం సమర్పించే సంప్రదాయం లేదని, ఈ విషయంపై మంత్రి కొండా సురేఖ పునరాలోచన చేయాలి. ప్రజల నమ్మకం, విశ్వా సంతో ముడిపడి ఉన్న అంశాన్ని ఎవరితో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారు?. బోనం అంటేనే జంతుబలి ఉండే ఆచారం తెలంగాణవ్యాప్తంగా ఉంది. అమ్మవారికి బోనాలు సమర్పించే క్రమంలో జంతుబలిని అపడం సాధ్యమవుతుందా?. పండితులు, అర్చకులు, నగర ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలి.
భద్రకాళీ అమ్మవారికి బోనాలు నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. రాజకీయ విభేదాలను అమ్మవారికి ముడిపెట్టి అసాంఘిక శక్తులను ప్రేరేపించి గొడవలు సృష్టిస్తారన్న అనుమానాలతో భద్రకాళీ బోనాల నిర్వహణను రద్దు చేశాం. భద్రకాళీ ఆలయం పరిధిలో శాకాహర బోనాలే ఉంటాయని ఈవో, వేద పండితులు, ప్రభుత్వం పలుమార్లు పునరుద్ఘాటించింది. ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుల నిర్ణయం మేరకు భద్రకాళీ అమ్మవారికి బోనాలు నిర్వహించాలని నిర్ణయించాం. అయితే కొంతమంది మాంసాహారంతో బోనాలు నిర్వహిస్తారనే ప్రచారంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రాజకీయాల కోసం భక్తుల్లో తప్పుడు భావాలు నింపడం సహేతుకం కాదని భద్రకాళీ బోనాలు వాయిదా వేశాం. భద్రకాళీ అమ్మవారి బోనాల నిర్వహణపై సంప్రదింపులు జరిపిన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.