హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం జరిగిన క్యాబినెట్ భేటీకి హాజరుకాలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా తనకు తెలియకుండానే యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్టు బోర్డును ఏర్పాటు నిర్ణయం జరిగిందనే అసంతృప్తితో ఆమె ఉన్నట్టు తెలుస్తున్నది. లండన్ నుంచి తిరిగొచ్చిన ఆమెకు బోర్డు ఏర్పాటు విషయం తెలియగానే సీఎం రేవంత్‌రెడ్డిపై తీరుపై తన సన్నిహితుల వద్ద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. దేవాదాయ శాఖ మంత్రినైన తనకు ఒక్కమాట కూడా చెప్పకుండానే నిర్ణయం తీసుకోవడంపై ఆమె మనస్తాపం చెందినట్టు చర్చ జరుగుతున్నది. ఇక భరించే ఓపిక లేదని స్పష్టంచేసినట్టు సమాచారం.
తనకు విలువలేని చోట, తన నిర్ణయాలను పట్టించుకోని చోట తాను ఉండాలనుకోవడంలేదని తెగేసి చెప్పినట్టు సమాచారం. అందుకే ఎంతమంది చెప్పినా, మంత్రులు ఫోన్లు చేసినా క్యాబినెట్ భేటీకి వచ్చేందుకు ఆమె ససేమిరా అన్నట్టు తెలిసింది. ఇప్పటికే యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు ఏర్పాటుపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వంపై బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డిపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌రెడ్డికి తోడుగా పీసీసీ చీఫ్ సైతం సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయాన్ని తప్పుపట్టడం గమనార్హం. ఇప్పుడు వీరిద్దరికి కొండా సురేఖ జత కావడంతో ఈ వివాదం ఎక్కడి వరకు పోతుందోననే ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొన్నది.