న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 1952 నాటి ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పథకం స్థానంలో కొత్త ఈపీఎఫ్ పథకం, 2026ను ప్రకటించింది. ఉద్యోగుల పీఎఫ్ చందా రేటులో ఎటువంటి మార్పు లేనప్పటికీ ఎంత చందా తప్పనిసరి, ఉద్యోగులు అంతకంటే ఎక్కువ చందా చెల్లించాలనుకుంటే ఏమవుతుందనే విషయాలను ఈ కొత్త పథకం స్పష్టంగా వివరిస్తున్నది. ఈ సవరించిన నిబంధనలు దాదాపు 8 కోట్ల మంది క్రియాశీల ఈపీఎఫ్‌వో చందాదారుల కోసం ఈపీఎఫ్ విధానాన్ని మరింత సరళంగా, డిజిటల్ ఆధారితంగా, సులభంగా ఉపయోగించుకునేలా చేస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది.
ఉద్యోగి తప్పనిసరి చందా అనేది చట్టపరమైన వేతన గరిష్ఠ పరిమితి(ప్రస్తుతం నెలకు రూ. 15,000) వరకు మాత్రమే వర్తిస్తుందని కొత్త పథకం స్పష్టంగా పేర్కొంటున్నది.దీని అర్థం తప్పనిసరి ఈపీఎఫ్ చందా రూ. 15,000లో 12%గా కొనసాగుతున్నది. అంటే నెలకు రూ. 1,800 అవుతుంది. చట్టం ప్రకారం యజమానులు కూడా అంతే మొత్తంలో చందాను చెల్లించడం కొనసాగిస్తారు. ఇదివరకు చాలా మంది ఉద్యోగులు కంపెనీ విధానాలు లేదా పరస్పర ఒప్పందాల ఆధారంగా అధిక జీతాలపై విరాళాలు అందించేవారు.
కొత్త నిబంధనలు ఇప్పుడు తప్పనిసరి, స్వచ్ఛంద విరాళాల మధ్య స్పష్టంగా తేడాను చూపుతున్నాయి. ఉద్యోగులు తమ ఉద్యోగ విరమణ పొదుపు కోసం అధిక చందాను ఇవ్వదలచుకుంటే దాన్ని కొనసాగించవచ్చు. కాని తప్పనిసరి రూ. 1,800 చందా కన్నా చెల్లించే అధిక మొత్తం స్వచ్ఛంద చందాగా పరిగణించడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ ఒప్పందం లేదా కంపెనీ విధానం ప్రకారం అంగీకరించి ఉంటే తప్ప యజమానులు ఈ అదనపు స్వచ్ఛంద చందాలకు సమానమైన మొత్తాన్ని జమ చేయవలసిన అవసరం లేదు.
కొత్త పథకంలో ఈపీఎఫ్ చందా రేట్లలో ఎటువంటి మార్పు లేదు. ఉద్యోగులు, యజమానులు 12% చొప్పున విరాళాలు జమచేయవలసి ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వ నోటిఫికేషన్ల ప్రకారం 10% తగ్గిన చందా రేటుకు ఇప్పటికే అర్హత కలిగిన సంస్థలు ఆ తక్కువ రేటునే అనుసరించడం కొనసాగిస్తాయి. కొత్త పథకం మరో ముఖ్య లక్షణం డిజిటల్ సేవలపై మరింత దృష్టి పెట్టడం. ఈ పథకం ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లు, ఆన్లైన్ క్లెయిమ్ ప్రాసెసింగ్, ఈ-పాస్‌బుక్‌లు, యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనుసంధానాన్ని ప్రోత్సహిస్తుంది.
పాక్షిక విత్‌డ్రాయల్స్‌కు సంబంధించి ఈపీఎఫ్ పథకం, 2026లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులను ఈపీఎఫ్‌వోకు చెందిన కేంద్ర ట్రస్టీల బోర్డు గత ఏడాదే ఆమోదించగా వాటిని కొత్త పథకంలో పొందుపరచడం జరిగింది. అనేక భిన్న వర్గాలకు బదులుగా, నగదు ఉపసంహరణ నిబంధనలను మూడు ప్రధాన సమూహాలుగా ప్రభుత్వం సరళీకరించింది. నిర్ణీత షరతులు, కనీస నిల్వ(మినిమం బ్యాలెన్స్) నిబంధనలకు లోబడి అనారోగ్యం, విద్య, వివాహం వంటి అత్యవసర అవసరాలకు, గృహ సంబంధిత అవసరాలకు, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సభ్యులు నిధులను ఉపసంహరించుకోవచ్చు.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) నిర్వహించే కొత్త సామాజిక భద్రతా పథకాల్లో డిజిటల్ నిబంధనల పాటింపు, ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణ, పెన్షన్ నిర్ధారణ వంటి క్లెయిమ్‌ల సకాల పరిష్కారం ప్రధాన అంశాలుగా ఉంటాయి. సామాజిక భద్రతపై కొత్త చట్టం కింద ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్ పథకం, 2026, ఉద్యోగుల పెన్షన్ పథకం, 2026, ఉద్యోగుల డిపాజిట్‌తో ముడిపడిన బీమా పథకం, 2026ని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ గురువారం నోటిఫై చేసింది.
కొత్త పథకాల కింద ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉపసంహరణకు సంబంధించిన క్లెయిమ్‌లను 20 రోజుల్లోగా పరిష్కరించని పక్షంలో 12 శాతం పెనాల్టీ వడ్డీని చెల్లించాలనే కఠిన నిబంధనను సంబంధిత మంత్రిత్వశాఖ విధించింది. కొత్త పథకాల ప్రకారం అన్ని విధాలా సంపూర్ణంగా ఉన్న ఒక క్లెయిమ్‌ను తగిన కారణం లేకుండా 20 రోజుల్లోగా పరిష్కరించడంలో కమిషనర్ విఫలమైన పక్షంలో ఆ గడువు దాటిన తర్వాత జరిగే జాప్యానికి కమిషనరే బాధ్యులవుతారని, అప్పుడు ఆ ప్రయోజన మొత్తంపై సంవత్సరానికి 22 శాతం చొప్పున జరిమానా వడ్డీని విధించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆ మొత్తాన్ని కమిషనర్ జీతం నుండి మినహాయించడం జరుగుతుందని నోటిఫికేషన్ పేర్కొంది. కొత్తగా నోటిఫై చేసిన ఈ పథకాలు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్ పథకం, 1952, ఉద్యోగుల కుటుంబ పెన్షన్ పథకం, 1971, ఉద్యోగుల పెన్షన్ పథకం, 1995ని, ఉద్యోగుల డిపాజిట్‌తో ముడిపడిన బీమా పథకం, 1976 స్థానంలో అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.