బంతితో ఉమేశ్ యాదవ్ ప్రత్యర్థి ప్లేయర్లను చెడుగుడాడుకుంటే.. బ్యాట్‌తో రస్సెల్ వీరంగమాడాడు! క్రీజులో ఉన్నది ఎంత పెద్ద ఆటగాడైనా.. తన బంతిని తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ఉమేశ్ నిరూపిస్తే..బౌలర్ ఎవరైనా తన దూకుడు ముందు తలవంచాల్సిందేనన్న చందంగా రస్సెల్ నాటు కొట్టుడు కొట్టాడు ఫలితంగా పంజాబ్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో భారీ విజయాన్నందుకున్న కోల్‌కతా.. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకొని పాయింట్ల పట్టికలో టాప్కు దూసుకెళ్లింది.
ముంబై: సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ బంతితో నిప్పులు చెరిగిన చోట డేంజర్ మ్యాన్ అండ్రె రస్సెల్ బ్యాట్‌తో విశ్వరూపం కనబర్చడంతో ఐపీఎల్ 15వ సీజన్లో కోల్‌కతా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 18.2 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. భానుక రాజపక్స (9 బంతుల్లో 31; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. కగిసో రబడ (16 బంతుల్లో 25; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ఆఖర్లో విలువైన పరుగులు సాధించాడు. ఉమేశ్ (4/23) ధాటికి పంజాబ్ ఆటగాళ్లు క్రీజులో నిలిచేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1) మొదటి ఓవర్లోనే పెవిలియన్ చేరిపోగా.. ధవన్ (16), లివింగ్‌స్టోన్ (19), రాజ్ బవా (11), షారుక్ ఖాన్ (0), హర్‌ప్రీత్ బ్రార్ (14) ఎక్కువసేపు నిలువలేకపోయారు.
అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ 14.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. రస్సెల్ (31 బంతుల్లో 70 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (26; 5 ఫోర్లు), సామ్ బిల్లింగ్స్ (24 నాటౌట్) రాణించారు. బౌలర్‌తో సంబంధం లేకుండా రస్సెల్ రఫ్ఫాడించాడు. హర్‌ప్రీత్ బ్రార్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో మోత మొదలు పెట్టిన రస్సెల్.. 12వ ఓవర్ వేసిన ఓడెన్ స్మిత్‌కు చుక్కలు చూపించాడు. తొలి బంతిని బౌండ్రీకి తరలించిన రస్సెల్.. ఆ తర్వాతి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు.
నాలుగో బంతి డాట్‌బాల్ కాగా.. ఐదో బంతికి మరో సిక్సర్ అరుసుకున్నాడు. ఆఖరి బంతి నోబాల్ కాగా.. బిల్లింగ్స్ కూడా ఒక సిక్సర్ బాదడంతో ఆ ఒక్క ఓవర్లో 30 పరుగులు వచ్చాయి. 26 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న రస్సెల్.. అర్శ్‌దీప్ ఓవర్లో 4,6తో పాటు లివింగ్‌స్టోన్ ఓవర్లో మరో రెండు భారీ సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు. ఉమేశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. శనివారం ‘డబుల్ హెడర్’లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 18.2 ఓవర్లలో 137 ఆలౌట్
(భానుక 31; ఉమేశ్ 4/23, సౌథీ 2/36),
కోల్‌కతా: 14.3 ఓవర్లలో 141/4 (రస్సెల్ 70 నాటౌట్; శ్రేయస్ 26; చాహర్ 2/13).