కోదాడ, జులై 07 : గంజాయి, ఇసుక మాఫియాకు కోదాడ అడ్డాగా మారిందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడలోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రా సరిహద్దుల నుండి గంజాయి కోదాడ డివిజన్లోని మండలాలతో పాటు గ్రామాలకు విస్తరించడంతో యువత మత్తులో మునిగి నిర్వీర్యం అవుతున్నట్లు తెలిపారు. ఇటీవల కోదాడ మండలం దొరకుంట, అనంతగిరి మండలంలోని పలు గ్రామాల్లో గంజాయి పట్టుబడ్డ విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. గతంలో గంజాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని గగ్గోలు పెట్టిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉత్తమ్ పద్మావతి ఇప్పుడేం ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు.
అధికార యంత్రాంగం మద్దతుతో గంజాయి, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ, నియోజకవర్గ ప్రజల అభివృద్ధే లక్ష్యమని గొప్పలు చెప్పుకునే మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతులు నిలువరించలేకపోయారని, పాలన గాడి తప్పిందన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గ్రామాల పేరిట పాలేరు వాగు పరివాహక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఎక్కువ రేటుకు అమ్ముతున్నప్పటికీ పట్టించుకునే దిక్కేలేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణాలు, పల్లెలు పచ్చదనంతో కళకళలాడితే, నేడు గ్రామాల్లో ట్రాక్టర్ డీజిల్‌కు డబ్బులు లేక పారిశుధ్యం లోపంతో కంపు కొడుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ఎన్ని సమీక్షలు చేసినా ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు సాగడం లేదన్నారు. కోదాడ ప్రభుత్వ దవాఖానాలో రెండేడ్లుగా ప్రసూతి వైద్యురాలు లేక నిరుపేదలు ప్రైవేట్ దవాఖానాలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు రైతులకు అవసరమైన యూరియాను కూడా సకాలంలో సరఫరా చేయకపోవడం దురదృష్టకరమన్నారు. సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేసి సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవం తప్పదన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సుంకర అజయ్ కుమార్, కవిత, రమేశ్, నర్సిరెడ్డి, భూపాల్ రెడ్డి, సురేశ్, నయీమ్, మధుసూదన్ రెడ్డి, కర్ల సుందర్ బాబు, లలితా రామారావు, వెంకట్, చంద్రశేఖర్, ఇమ్రాన్ ఖాన్, ఉపేందర్, నాయకులు పాల్గొన్నారు.